ఇంట్లో భారీగా డబ్బు దాస్తే... లెక్కలు చెప్పాలె.. లేకపోతే ఇబ్బందులు తప్పవు

ఇంట్లో భారీగా డబ్బు దాస్తే... లెక్కలు చెప్పాలె..  లేకపోతే ఇబ్బందులు తప్పవు
  • భారీ  పెనాల్టీలకు అవకాశం

న్యూఢిల్లీ: ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా సబ్బో సర్ఫో కొన్నాలన్నా యూపీఐ వంటి డిజిటల్​పేమెంట్స్​ వాడుతున్నారు.  జేబు నుంచి డబ్బు తీసి కొనేవారి సంఖ్యా తక్కువేమీ లేదు.  రోజువారీ ఖర్చుల కోసమో అత్యవసరాల కోసమో చాలా మంది ఇంట్లో డబ్బును దాచి పెట్టుకుంటున్నారు. చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చో తెలుసా ?  ఇంత మొత్తం వరకే దాచిపెట్టాలనే రూలేమీ లేదు.  

ఆ డబ్బును లీగల్​గానే సంపాదించుకున్నామని మాత్రం నిరూపించుకోవాలి. లేకపోతే చిక్కులు తప్పవు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా భారీ మొత్తంలో డబ్బు దాస్తే సమస్యలు రావొచ్చు. ఐటీ అధికారులకు జవాబు చెప్పలేకపోతే భారీ ఎత్తున పెనాల్టీలు పడతాయి. 

ఎక్స్​పర్టులు ఏమంటున్నారంటే..

ఆర్థిక సేవలు అందించే ఈఎక్స్​ఎల్​లో మేనేజర్​భూపేశ్​ జిదానీ మాట్లాడుతూ వ్యక్తులు ఇంట్లో డబ్బు దాచడానికి పరిమితులు ఏమీ లేవన్నారు. అయితే లెక్కల్లో చూపని డబ్బు ఉంటే మాత్రం ఐటీ చట్టంలోని సెక్షన్​69ఏ కింద 60 శాతం వరకు పెనాల్టీ, సర్ చార్జ్​, సెస్ ​కట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఐటీ అధికారులు దాడులు నిర్వహించినప్పుడు డబ్బు దొరికితే కచ్చితంగా సంబంధిత డాక్యుమెంట్లను వాళ్ల ముందు ఉంచాలని స్పష్టం చేశారు. 

ఆర్​బీఐ రూల్స్​ప్రకారం వ్యక్తుల దగ్గర రూ.50 వేల కంటే ఎక్కువ క్యాష్​ ఉంటే బ్యాంకుకు రిపోర్ట్​ చేయాలి. డబ్బు దాయడానికి పరిమితులు లేకపోయినా అవి ఎక్కడి నుంచో వచ్చాయో తెలియజేయాలని చార్టెర్డ్​ ఎకౌంటెంట్​ప్రాంజల్​ గుప్తా అన్నారు. రహస్యంగా దాచిన డబ్బుపై 137 శాతం వరకు పెనాల్టీ పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒక వ్యక్తి ఒక రోజులో రూ.రెండు లక్షలు లేదా ఇంతకుమించి డబ్బును సింగిల్​ట్రాన్సాక్షన్​లో తీసుకోకూడదు. 

ఇలా చేస్తే సెక్షన్​269 ఎస్టీ ప్రకారం వంద శాతం పెనాల్టీ విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. రూ.20 వేలు లేదా ఇంతకు మించిన మొత్తాన్ని క్యాష్​ రూపంలో లోన్​ కోసం కట్టకూడదు. ఆర్థిక సంస్థలూ ఆమోదించకూడదు. ఇలా చేస్తే 269ఎస్​ఎస్​, 269టీ ప్రకారం పెనాల్టీలు వేస్తారు. బ్లాక్ మనీని అరికట్టడానికి, పారదర్శకతను పెంచడానికి ఈ రూల్స్‌ తీసుకొచ్చారని పన్ను అధికారులు అన్నారు. భారీ లావాదేవీలకు డిజిటల్​ పేమెంట్​ విధానాలనే వాడాలంటున్నారు.