ఈసారి రెపో పెంపు ఎంత?

ఈసారి రెపో పెంపు ఎంత?

ముంబై: రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా మానిటరీ పాలసీ  కమిటీ (ఆర్​బీఐ ఎంపీసీ) మీటింగ్​ సోమవారం మొదలైంది. ఈసారి రెపో  రేటును 25 బేసిస్​ పాయింట్ల మేర పెంచుతారని అంచనా వేస్తున్నారు. రేట్ల పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు కిందటేడాది మే నుంచి వరసగా వడ్డీ రేట్లను పెంచుతున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు అంటే ఈ నెల 6 వ తేదీ దాకా గవర్నర్​ శక్తికాంత దాస్​ నాయకత్వంలో ఈ మీటింగ్​ జరుగుతుంది. ఎంపీసీ నిర్ణయాన్ని గురువారం నాడు శక్తికాంత దాస్​ ప్రకటిస్తారు. 

మే 2022 నుంచి చూస్తే రెపో రేటును ఆర్​బీఐ 250 బేసిస్​ పాయింట్ల మేర పెంచింది. రెపో రేటు పెంచినా ఇన్​ఫ్లేషన్​ మాత్రం ఆర్​బీఐ టార్గెట్​ అయిన 6 శాతం కంటే ఇంకా పైనే కొనసాగుతోంది. బాగా పెరిగిన రిటెయిల్​ ఇన్​ఫ్లేషన్​తోపాటు, యూఎస్​ ఫెడ్​, యూరోపియన్​ సెంట్రల్​ బ్యాంక్​, బ్యాంక్​ ఆఫ్​ ఇంగ్లాండ్​ ఇటీవల తీసుకున్న చర్యలపైనా ఎంపీసీ మీటింగ్​ దృష్టి పెట్టనుంది. నవంబర్​, డిసెంబర్​నెలల్లో 6 శాతం కిందకి దిగిన ఇన్​ఫ్లేషన్​ జనవరిలో మళ్లీ పైకి ఎగబాకింది. ఈ ఏడాది జనవరిలో కన్జూమర్​ ప్రైస్​ ఇండెక్స్​ (సీపీఐ) ఆధార ఇన్​ఫ్లేషన్​ 6.52 శాతంగాను, ఫిబ్రవరి నెలలో 6.44 శాతంగాను రికార్డయింది. ఆర్​బీఐ రెపో రేటును 25 బేసిస్​ పాయింట్లు పెంచొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

 ఈ సైకిల్​లో  రెపో రేటు పెంచడం ఇదే చివరిసారి కావొచ్చని వారు పేర్కొంటున్నారు. దేశంలో రిటెయిల్​ ఇన్​ఫ్లేషన్​ను 4 శాతం కిందకి తేవాలని ఆర్​బీఐ టార్గెట్‌‌గా పెట్టుకుంది. కానీ, అది ఇంకా 6 శాతం కిందకి దిగిరావడం లేదు. జనవరి 2022 నుంచి వరసగా మూడు క్వార్టర్లలోనూ రిటెయిల్​ ఇన్​ఫ్లేషన్​ ఈ లెవెల్ ​కంటే పైనే కొనసాగింది.