
కరెంటు చార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం
ఏ మేరకు పెంపు అన్నది సీఎం నిర్ణయిస్తారు: జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కరెంట్ చార్జీల పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. దీనిపై సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని.. చార్జీల పెంపు ఏమేరకు ఉంటుందన్నది సీఎం నిర్ణయిస్తారని తెలిపారు. వచ్చే వానాకాలం నుంచి తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలకు ఎస్సారెస్పీ నీళ్లు ఇస్తామన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్–2, ఇతర పనులపై సోమవారం ఇరిగేషన్ ఇంజనీర్లు, అధికారులతో జగదీశ్‌రెడ్డి సమీక్షించారు. డిసెంబర్ నుంచి ఎస్సారెస్పీ స్టేజ్–2కు నిరంతరంగా నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. మార్చి ఆఖరులో ఆపేసి కాల్వల రిపేర్లు చేపడతామన్నారు. ఈ పనులను టాప్ ప్రయారిటీగా తీసుకోవాలన్నారు. సమీక్ష తర్వాత జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పూర్తి ఆయకట్టుకు అందిస్తం
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సూర్యాపేటకు సాగునీరు ఇచ్చామని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఎస్సారెస్పీ నుంచి సూర్యాపేట దాకా నీళ్లొస్తాయా అన్న నిర్లక్ష్యంతో గతంలో కాల్వల పనులు అరకొరగా చేపట్టారని, వాటన్నింటినీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద ఉన్న మొత్తం ఆయకట్టుకు వానాకాలంలో నీళ్లివ్వడమే టార్గెట్‌గా పనులు చేస్తున్నామని జగదీశ్‌రెడ్డి తెలిపారు.
ఎంత కరెంట్ అయినా ఇస్తం
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు పూర్తి స్థాయిలో నడిస్తే రోజుకు 15 వేల మెగావాట్ల కరెంట్ డిమాండ్ ఏర్పడే అవకాశముందని, ఆ మేరకు సరఫరాకు సిద్ధంగా ఉన్నామని జగదీశ్‌రెడ్డి చెప్పారు.
For More News..