ఒకప్పుడు ప్రతి వంటగదిలో బెల్లం ఉండేది. పండుగలు, శుభకార్యాల్లోనూ బెల్లం వంటకాలు తప్పనిసరిగా కనిపించేవి. కానీ, ఇప్పుడు లైఫ్ స్టయిల్ మారిపోవడంతో దాని ప్లేస్‌లోకి రిఫైన్డ్ షుగర్ వచ్చి చేరింది. మళ్లీ బెల్లాన్ని ప్రతి ఇంటికీ చేరువ చేయాలనే లక్ష్యంతో నవ్‌నూర్ కౌర్ ‘జాగర్‌కేన్’ను స్థాపించింది. ఇప్పుడా బ్రాండ్ వేలాది మందికి ఆరోగ్యకరమైన లైఫ్‌స్టయిల్‌ని పరిచయం చేయడంతోపాటు వందలాదిమందికి ఉపాధిని ఇస్తోంది.
పంజాబ్‌లోని లూధియానాకు చెందిన నవ్‌నూర్ కౌర్‌కు చిన్నప్పటి నుంచే బెల్లం అంటే ఇష్టం. బెల్లం ఆరోగ్యకరమైనది అనే భావనతో పెరిగింది. కానీ, కాలం మారే కొద్దీ మార్కెట్లో తెల్ల చక్కెర వాడకం పెరిగింది. ఒకరోజు నవ్‌నూర్ మనసులో “ఇంత ఆరోగ్యకరమైన సంప్రదాయ ఫుడ్‌కు మాడ్రన్ లైఫ్ స్టయిల్లో ఎందుకు చోటు దక్కలేదు?” అనిపించింది. అందుకే ఆమెతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా 2018లో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడడం మొదలుపెట్టారు.
కానీ.. బెల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడం, నాణ్యమైన బెల్లం దొరక్కపోవడం, బెల్లం వేసినప్పుడు పాలు పులిసిపోవడం లాంటి సమస్యలు ఎదురయ్యాయి. నవ్నూర్కు ఈ కారణాల వల్లే ఇప్పటివాళ్లు బెల్లానికి దూరమయ్యారు అనిపించింది. పైగా దేశంలో బెల్లం మార్కెట్ గత 50 ఏళ్లలో పెద్దగా మారలేదు. ఈ రంగంలో సరైన ఆవిష్కరణలు, బ్రాండ్లు లేవు. అందుకే ఆమె ముందడుగు వేసి కొత్త ఆవిష్కరణలు చేయాలి అనుకుంది. కానీ.. నవ్‌నూర్ అప్పటికే ఐఐఎం ఘజియాబాద్‌లో ఎంబీఏ(మార్కెటింగ్) చదువుతోంది. అందుకే చదువుకు ఫుల్స్టాప్ పడుతుందనే ఉద్దేశంతో స్టార్టప్ పెట్టాలనే ఆలోచనను పోస్ట్‌పోన్ చేసింది.
చదువు పూర్తయ్యాక..
2019లో నవ్‌నూర్ చదువు పూర్తయ్యింది. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూనే బెల్లంపై లోతుగా పరిశోధనలు చేసింది. ఆమె బెల్లాన్ని కేవలం చాయ్‌లో వేసుకునే పదార్థంగా కాకుండా, ప్రతి తీపి వంటకంలో వాడేలా చేయాలని నిర్ణయించుకుంది. తన ఇంట్లోని వంటగదినే పరిశోధనా కేంద్రంగా మార్చుకుని బెల్లంతో ప్రయోగాలు చేసింది. అవే చివరికి 2021లో జాగర్ కేన్‌కు పునాదులు వేశాయి. ‘‘తొలిరోజుల్లో బెల్లంతో దాదాపు 15 రకాల రెసిపీలను తయారుచేశా. కానీ.. వాటిలో నాలుగింటిని మాత్రమే ప్రొడక్షన్‌కు ఎంపిక చేసుకున్నాం. ముఖ్యంగా పాల రుచిని పెంచడానికి, పరాటాలు, పెరుగులో కలపడానికి అనువైన బెల్లాన్ని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాం” అని గుర్తుచేసుకుంది నవనూర్.
కౌశల్‌తో కలిసి..
నవ్‌నూర్ స్టార్టప్ పెట్టిన తర్వాత కిచెన్ నుంచి డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు అనిపించింది. అందుకే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పెట్టేందుకు స్థలం కోసం వెతికింది. చాలా రోజుల వరకు ఆమెకు సరైన స్థలం దొరకలేదు. అన్నీ రోడ్డు పక్కనే ఉన్నాయి. అలాంటి ప్లేస్‌లో యూనిట్ పెడితే ధూళి, కాలుష్యం మధ్య బెల్లం తయారుచేయాల్సి వస్తుంది. అదే టైంలో ఆమెకు కౌశల్ సింగ్ పరిచయం అయ్యాడు. అతనికి అప్పటికే ఒక మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఉంది. ఒకప్పుడు తానూ జాగరీ బ్రాండ్ మొదలుపెట్టాలి అనుకున్నాడు. కానీ.. మార్కెట్లో డిమాండ్ లేక ఆ ఆలోచనను వదిలేశాడు. ఈ ఇద్దరి ఆలోచనలు కలవడంతో కలిసి “జాగర్‌కేన్” ను ప్రారంభించారు.
నిల్వ సమస్యకు పరిష్కారం
సాధారణంగా బెల్లం త్వరగా తేమను పీల్చుకుని, పాడవుతుంది. ఎగుమతుల విషయంలో ఈ సమస్య పెద్ద అడ్డంకిగా మారుతుంది. దాన్ని పరిష్కరించడానికి నవ్‌నూర్, కౌశల్ ఇద్దరూ బెల్లం తయారీ వెనుక ఉన్న బయోకెమిస్ట్రీని స్టడీ చేశారు. పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సాయంతో నేల నాణ్యత, పీహెచ్ లెవెల్స్, పంట కోత సమయం లాంటి అంశాలపై పరిశోధనలు చేశారు. చెరకు పంటకు పీహెచ్ స్థాయి 5.7 నుంచి 6.2 మధ్య ఉంటే బెల్లం నిల్వ కాలం చాలావరకు పెరుగుతుందని తెలుసుకున్నారు.
రైతులకు సపోర్ట్‌గా..
ఇప్పుడు 22 మంది రైతులు నవ్‌నూర్, కౌశల్ సూచించిన విధంగా బెల్లాన్ని పండిస్తున్నారు. దేశంలో చెరకు ఎక్కువగా రిఫైన్డ్ షుగర్ పరిశ్రమకే వెళ్తోంది. బెల్లం కోసం ప్రత్యేకంగా చెరకు పండించేందుకు రైతులను ప్రోత్సహించాలని నవ్‌నూర్ భావించింది. అందుకే వాళ్లకు గవర్నమెంట్ ఇచ్చే కనీస మద్దతు ధర కంటే 10 శాతం ఎక్కువ ఇస్తోంది. ఈ సంస్థ సంవత్సరానికి 200 ఎకరాల్లో పండిన చెరకు పంటను ప్రాసెస్ చేస్తోంది. 110 ఎకరాల్లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ నిర్వహిస్తోంది.
►ALSO READ | కొడుకు కోసం చెఫ్‌గా మారింది!
జాగర్‌కేన్ నుంచి ప్రతి నెలా వెయ్యి కిలోల బెల్లం అమ్ముతున్నారు. ఇప్పటివరకు యూఏఈ, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు దాదాపు రెండు లక్షల కిలోల బెల్లం ఎగుమతి చేశారు. ఈ బ్రాండ్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. లూధియానాలో ఉన్న ప్యాకేజింగ్ యూనిట్ పూర్తిగా మహిళలతోనే నడుస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకు ఉపాధి కల్పిస్తూ, ఆర్థిక స్వావలంబనకు దారి చూపుతున్నారు.
ప్రతిదీ కొత్తగా..
బెల్లం అంటే పాతకాలపు వస్తువు అనే భావనను మార్చాలని నవ్‌నూర్ నిర్ణయించుకుంది. డిపార్ట్మెంట్ స్టోర్లలో ఏదో ఒక మూలన ఉండే సాధారణ వస్తువుగా కాకుండా, యువత కూడా ఇష్టపడేలా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ప్యాకేజింగ్ నుంచి మార్కెటింగ్ వరకు ప్రతిదీ కొత్తగా చేస్తోంది. బెల్లంలో డ్రై ఫ్రూట్స్, నట్స్, కొబ్బరి లాంటి ఆరోగ్యకరమైన పదార్థాలను కలిపి కొన్ని ప్రత్యేక ఉత్పత్తులను తయారుచేసింది. ప్రజలు రుచి చూసిన తర్వాతే కొనాలనే ఆలోచనతో లూధియానాలో చిన్న స్టాళ్లు ఏర్పాటుచేశారు.
వాళ్ల ప్రొడక్ట్స్ శాంపిల్స్‌ని ఆ స్టాళ్లలో పెట్టారు. వాటిని తిన్నవాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ వాళ్లలో నమ్మకాన్ని పెంచింది. ముఖ్యంగా కొబ్బరి-బెల్లం మిక్స్ లాంటివి యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. దాంతో 2021లో నవ్‌నూర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో వ్యాపారంలోకి దిగింది. కొద్ది కాలంలోనే బ్రాండ్ సంవత్సరానికి రూ. 2 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది.
