క్రిప్టో స్కాం : రూ.1.30 లక్షల కోట్ల వ్యాపారం .. జీరో అయిన వేళ !!

క్రిప్టో స్కాం : రూ.1.30 లక్షల కోట్ల వ్యాపారం .. జీరో అయిన వేళ !!

యావత్ క్రిప్టో మార్కెట్ షాక్ కు గురైంది. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలలో ప్రకంపనలు వచ్చాయి. రూ.1.30 లక్షల కోట్ల క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ వ్యాపార సామ్రాజ్యం విలువ.. పది రోజుల్లోనే అనూహ్యంగా జీరోకు పడిపోయింది. ఏమిటా పతనం ? ఎందుకలా జరిగింది ? తెలుసుకుందాం రండి.. 

క్రిప్టో కరెన్సీ మార్కెట్ ను కుదిపేస్తున్న ఈ కుంభకోణం గురించి తెలుసుకోవాలంటే.. మొట్టమొదట  ‘స్యామ్ బ్యాంక్ మ్యాన్ ఫ్రైడ్’ గురించి తెలుసుకోవాలి. రూ.1.30 లక్షల కోట్ల నుంచి జీరోకు పడిపోయిన  క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ ‘FTX’ ఆయనదే. స్యామ్ పుట్టింది పెరిగింది అమెరికాలోని కాలిఫోర్నియాలో. కానీ  క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ ‘FTX’ ను కరీబియన్ దేశం బహమాస్ కేంద్రంగా 2019 సంవత్సరం మే నెలలో స్థాపించాడు. 3 పదుల వయసు కూడా దాటకముందే స్యామ్ అపర కుబేరుడయ్యాడు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కోసం సామాన్య ఇన్వెస్టర్లతో పాటు ఎంతోమంది వీఐపీలు, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అతడి ఎక్స్ఛేంజీలో భారీగా డబ్బులు మదుపు చేశారు. దీంతో స్థాపించిన రెండేళ్లలోనే ( 2021  నాటికి) అతడి కంపెనీ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ వ్యాపారంలో అంచనాలకు అందని స్థాయికి ఎదిగింది.  

అమెరికా మధ్యంతర ఎన్నికలకు 300 కోట్ల చందా

మరోవైపు స్యామ్ చేతికి ఎముక లేని  విధంగా దానధర్మాలు చేసేవాడు. దాతృత్వం, సేవాభావం కలిగిన వ్యక్తిగా ఎంతో మంచి పేరును సంపాదించాడు.  అంతేకాదు ఇటీవల జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికలకు కూడా స్యామ్ స్పాన్సర్  చేశాడు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రాతినిధ్యం వహించే డెమొక్రటిక్  పార్టీకి  దాదాపు రూ.300 కోట్లను చందాగా ఇచ్చాడు.  దీంతో అక్కడి మీడియా అతడిపై ప్రత్యేక కథనాలను ప్రచురించింది. అత్యంత ప్రభావశీల వ్యక్తి అంటూ ప్రముఖ మేగజైన్లన్నీ స్యామ్ పై కవర్ స్టోరీలు ప్రచురించాయి.

72 గంటల్లోనే 65వేల కోట్లు విత్ డ్రా చేయడంతో..

ఈక్రమంలో ఓ అనూహ్య పరిణామం జరిగింది.ఈనెల 8 నుంచి 10 తేదీల మధ్య.. కేవలం 72 గంటల్లోనే స్యామ్ బ్యాంక్ మ్యాన్ ఫ్రైడ్ కు చెందిన  ‘FTX’ ఎక్స్ఛేంజీ నుంచి ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవడం మొదలు పెట్టారు. 72 గంటల్లోనే FTX నుంచి మదుపరులు దాదాపు రూ.65వేల కోట్లు విత్ డ్రా చేయడంతో ‘FTX’ ఎక్స్ఛేంజీ కుప్పకూలింది. కంపెనీ దివాలా తీసిందని స్యామ్ బ్యాంక్ మ్యాన్ ఫ్రైడ్ ప్రకటించాడు. ఈ ఆకస్మిక పరిణామంతో  ‘FTX’ ఎక్స్ఛేంజీ మార్కెట్ విలువ కాస్తా రూ.1.30 లక్షల కోట్ల నుంచి జీరోకు  ఢమాల్ అయింది. 

అలమేడా రిసెర్చ్ కు 81వేల కోట్లు దారిమళ్లించిండు

దీంతో అమెరికా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ‘FTX’ ఎక్స్ఛేంజీ ద్వారా డిపాజిట్ల రూపంలో ప్రజల నుంచి స్యామ్ సేకరించిన లక్షల కోట్ల నిధులపై విచారణను మొదలుపెట్టాయి. ఇన్వెస్టర్లు డిపాజిట్లు ఉపసంహరణ చేసుకున్నది ఎంత ? మిగిలిన డబ్బు ఎంత ? లావాదేవీల్లో అక్రమాలు ఏమైనా జరిగాయా ? ‘FTX’ ఎక్స్ఛేంజీకి చెందిన నిధులు ఇతరత్రా సంస్థలకు దారి మళ్లాయా ? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈక్రమంలో  ‘అలమేడా రిసెర్చ్’ అనే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కంపెనీ పేరు తెరపైకి వచ్చింది. దీన్ని కూడా స్యామ్ బ్యాంక్ మ్యాన్ ఫ్రైడ్ స్థాపించాడని గుర్తించారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ‘అలమేడా రిసెర్చ్’ కంపెనీని గట్టెక్కించేందుకు స్యామ్ మోసానికి పాల్పడ్డాడు.

ఇన్వెస్టర్లకు సమాచారం ఇవ్వకుండా..

ఇన్వెస్టర్లకు సమాచారం ఇవ్వకుండా ‘FTX’ ఎక్స్ఛేంజీ నుంచి ‘అలమేడా రిసెర్చ్’ కు దాదాపు రూ.81వేల కోట్లను మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా గుర్తించాయి. ఇలా దారిమళ్లిన నిధుల సంగతేంటి ? వాటిని తిరిగి సేకరించి నష్టపోయిన ‘FTX’ ఎక్స్ఛేంజీ ఇన్వెస్టర్లకు అందిస్తారా ? అనే దానిపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికి స్యామ్ బహమాస్ లోనే ఉన్నాడు. త్వరలోనే అతడిని అరెస్టు చేసి అమెరికాకు తీసుకొచ్చే దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నేరానికి సంబంధించిన అభియోగాలన్నీ నిరూపితమైతే అతడికి జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

కొంటామని ముందుకొచ్చిన బినాన్స్.. మరుసటి రోజే నో చెప్పింది

ఈ పరిణామాల నేపథ్యంలో దివాలా తీసిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ FTXను కొనుగోలు చేస్తామని మరో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కంపెనీ బినాన్స్ ఈనెల  9న ప్రకటించింది. దీనికి సంబంధించి FTXతో నాన్ బైండింగ్ అగ్రిమెంట్ ను కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే ఒక్క రోజైనా గడువకముందే బినాన్స్ కంపెనీ మాట మార్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ‘FTX’ ఎక్స్ఛేంజీ పై దర్యాప్తు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో .. దాన్ని కొనుగోలు చేయలేమని తేల్చి చెప్పింది. దీంతో FTX ఎక్స్ఛేంజీ భవితవ్యం ప్రశార్ధకంగా మిగిలిపోయింది.