అనగనగా ఒక ఊరు..కరైకుడిలో పొంగల్

అనగనగా ఒక ఊరు..కరైకుడిలో పొంగల్

సంక్రాంతినే తమిళులు పొంగల్​గా చేసుకుంటారు. తమిళ తల్లి అయిన తై కొవిల్​ పేరు మీదుగా తై పొంగల్​ ఫెస్టివల్​ చేసుకుంటారు. ఆ దేవత దేవాలయం ఉన్న ఊరు కరైకుడి. ఆ ఊరి విశేషాలే ఇవి... 

తమిళనాడులోని శివగంగ జిల్లాలోని మున్సిపల్ టౌన్ కరైకుడి. ఇది ఆ మున్సిపాలిటీలోనే అతి పెద్ద ఊరు. ఇది చెట్టినాడ్ ప్రాంతంలో ఉంటుంది. ఈ ఊరు అక్కడి ఇళ్ల నిర్మాణ శైలికి ఫేమస్. ఈ ఇళ్లన్నీ సున్నపురాయితో కట్టినవి. సున్నపు రాయిని స్థానిక భాషలో ‘కరై వీడు’ అని అంటారు. అక్కడ ఎక్కువగా కరై అనే చెట్లు పెరుగుతాయి. కాబట్టి దాన్నుంచే ఈ ఊరికి కరైకుడి అనే పేరు వచ్చిందని నమ్ముతారు కొందరు. 

కరైకుడి మొదట్లో రామనాథపురం జిల్లాలో ఉండేది. మున్సిపాలిటీగా1928లో మారింది. ఈ ఊరిని డెవలప్​ చేసేందుకు చెట్టియార్స్ కుటుంబం కీలకంగా పనిచేసిందనేది చరిత్ర. ఇప్పటికీ ఆ ఊరి జనాభాలో చెట్టియార్ కమ్యూనిటీ వాళ్లే ఎక్కువ. కరైకుడి ఏర్పడినప్పటి నుంచి ట్రేడింగ్​ పనులు చేస్తున్నారు వాళ్లు. ఈ ఊళ్లో ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ కట్టించడం, ఆలయాల నిర్మాణాల వంటివి చేశారు. పండుగలను సంప్రదాయ పద్ధతుల్లో సెలబ్రేట్ చేయడానికి కూడా వీళ్లే కారణం. అలా సామాజిక సంస్కరణల విషయంలో కూడా వాళ్లే బాధ్యత తీసుకున్నారు. వల్లల్​ అలగప్పార్ వల్ల  కరైకుడి చాలా రకాలుగా అభివృద్ధి చెందింది.

చెట్టియార్ ఫ్యామిలీకి చెందిన ఈయన అలగప్ప యూనివర్సిటీ స్థాపించాడు. ఈ యూనివర్సిటీకి జాతీయ​ స్థాయిలో ర్యాంకింగ్​ ఉంది. ఇది దేశంలోని బెస్ట్​ ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఒకటిగా పేరుగాంచింది. ఆ తర్వాతి కాలంలో ఇంజినీరింగ్​ కోర్సులతోపాటు ఆర్ట్స్, ఫైన్​ ఆర్ట్స్, సైన్స్​ కోర్సులను చేర్చారు. మంచి చదువులకే కాదు, సౌత్​ ఫిల్మ్ మేకర్స్​కు బెస్ట్​ షూటింగ్​ స్పాట్​ కూడా ఇదే. ఇప్పటికే ఎన్నో దక్షిణాది సినిమాలు ఇక్కడ షూటింగ్​ చేశారు. ఏవీఎం స్టూడియో ఉన్నది ఈ ఊళ్లోనే. దీన్ని ఏ.వి. మెయియప్ప చెట్టియార్​ ప్రారంభించారు. 

కరైకుడి వెళ్తే..

ఏ సీజన్​లో అయినా అక్కడికి వెళ్లొచ్చు. కరైకుడికి దగ్గరగా ఉన్న ఎయిర్​పోర్ట్ తిరుచ్చి. తిరుచ్చి నుంచి రైలు మార్గంలో వెళ్లొచ్చు. అంతేకాదు.. రోడ్డు మార్గంలో కూడా వెళ్లొచ్చు. కరైకుడి వెళ్తే మాత్రం తప్పకుండా చూడాల్సిన ప్లేస్​లు కొన్ని ఉన్నాయి. అవి.. కన్నుదయహయగి టెంపుల్, కొప్పుదై అమ్మన్​ టెంపుల్, మీనాక్షి సుందరేశ్వరర్ టెంపుల్, చెట్టినాడ్​ ప్యాలెస్. ఫుడ్​ విషయానికొస్తే.. లోకల్​ ఫుడ్​ ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేంత రుచికరంగా ఉంటుంది. లోకల్​ వంటలు, చెట్టినాడ్​ పేరుతో వంటకాలు ఉంటాయి. 

చెట్టినాడ్ అనేది చెట్టియార్ నుంచే వచ్చింది. చెట్టినాడ్ వంటల్ని కరైకుడి వంటలు అని కూడా అంటారు. ఎక్కువగా లోకల్​ ప్రజలు చెట్టినాడ్ వంటకం ‘ఆచి సమయాల్​’ని చాలా ఇష్టపడతారు. ఈ వంటల్లో రకరకాల సుగంధ ద్రవ్యాలు, మూలికలు వాడతారు. వండే పద్ధతి కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి లోకల్ డిషెస్ అయిన చీయమ్, కంధారప్పమ్, ఇలన్​దోసై, మసాలా పనియారమ్, దాల్చా ఇడియాప్పమ్ రుచి చూడొచ్చు. శ్నాక్స్ అయితే మురుక్కు వడై, తట్టై, పొరుల్​విలంగ ఉరుందై, కరుప్పాటి పనియారమ్, కుళల్, అధిరసమ్ టేస్ట్ చేయొచ్చు. 

సంక్రాంతి ముచ్చట్లు

1993లో మొదటిసారి తమిళ తల్లి తై కొవిల్​కి ఆలయం నిర్మించింది ఈ ఊళ్లోనే. ఇక్కడ సంక్రాంతిని తై పొంగల్​ పేరుతో జరుపుకుంటారు. సంక్రాంతిని నాలుగు రోజులు చేసుకుంటారు తమిళులు. కరైకుడిలో మాత్రం మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు వంటలు వండి, ఫ్రెండ్స్​,  బంధువుల​కు పెడతారు. రెండో రోజు పశువులకు ఇంపార్టెన్స్ ఇస్తారు. వాటికి స్నానం చేయించి, బాగా అలంకరిస్తారు. మూడో రోజు ఫ్యామిలీతో కలిసి టెంపుల్స్‌, టూరిస్ట్​ ప్లేస్​లకు వెళ్తారు. ఇదే రోజు జల్లికట్టు పోటీ జరుగుతుంది. దీన్నే బుల్​ఫైటింగ్ అంటారు.

బియ్యప్పిండితో ముగ్గులు

సంక్రాంతి పండుగలో ముగ్గులది స్పెషల్ ప్లేస్​. పండుగ నాడు వంట వండే దగ్గర ముగ్గు వేస్తారు. దీన్ని పొంగల్ కోలమ్​ అంటారు. ముగ్గు వేయడానికి ట్రెడిషనల్ పద్ధతిలో బియ్యప్పిండి తయారుచేస్తారు. దాన్ని కోలకూటు అంటారు.

అందుకోసం బియ్యాన్ని దంచి పిండి పట్టాలి. ఈ పిండిలో కొన్ని నీళ్లు పోసి గుండ్రంగా ఉండలు చుట్టాలి. వాటిని ఒకరోజంతా ఎండబెట్టాలి. ఆ తర్వాత వాటిని గిన్నెలో వేసి, కొన్ని నీళ్లు పోసి మిశ్రమం తయారుచేస్తే కోలకూటు రెడీ. అందులో చిన్న గుడ్డ ముక్క ముంచి, నేల మీద ముగ్గులా వేయాలి. ఇలా ముగ్గు వేసేటప్పుడు ఉంగరపు వేలు వాడతారు.  దీన్ని నడు వీటు కోలమ్ అంటారు. పెండ్లిళ్ల​లో ఈ ముగ్గు వేసి దీపం పెడతారు. దీన్ని కరైకుడిలోని నాగరతార్​ కులానికి చెందిన వాళ్లు ఎక్కువగా వాడతారు.