వరంగల్ సిటీలో అలంకారంగానే సీసీ కెమెరాలు

వరంగల్ సిటీలో అలంకారంగానే సీసీ కెమెరాలు
  • పనిచేయని కెమెరాలతో క్రైమ్ కంట్రోల్ ఎట్లా?
  • వరంగల్ సిటీలో అలంకారంగా సీసీ కెమెరాలు
  • నిర్వహణను గాలికొదిలేసిన ఆఫీసర్లు 
  • రిపేర్లకు నోచుకోక దిష్టిబొమ్మల్లా మారిన వైనం
  • కేసుల ఛేదనకు తీవ్ర అవాంతరాలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనరేట్​లో నిఘా వ్యవస్థ కునుకుతీస్తోంది. సిటీలో ఏర్పాటు చేసిన కెమెరాలు చాలావరకు పనిచేయడం లేదు. నిర్వహణ, రిపేర్లు లేక కరెంట్​స్తంభాలకు దిష్టిబొమ్మల్లా దర్శనిస్తున్నాయి. దీంతో వివిధ కేసుల ఛేదనతో పాటు నిందితులను గుర్తించడం కష్టతరమవుతోంది. కాగా, గత నెలలోనే హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్​ను ప్రారంభించి, వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో కొన్ని కెమెరాలను దానికి అనుసంధానించినప్పటికీ.. ఇక్కడి కెమెరాలు పనిచేయకపోవడంతో నగరంలో భద్రత ప్రశ్నార్థకమైంది.

వేలల్లో  కెమెరాలు.. నో రిపేర్లు

వరంగల్​సిటీకి రోడ్డు, రైలు మార్గాల కనెక్టివిటీ ఉండడంతో ఇక్కడ అంతర్రాష్ట్ర దొంగల ముఠాల బెడద, ఇతర నేరాలకు కూడా ఆస్కారం ఎక్కువ. క్రైమ్ రేట్ సైతం ఏటికేడు పెరిగిపోతోంది. దీంతో గత మూడేండ్లలో కమిషనరేట్​ పరిధిలో దాదాపు 55 వేల కెమెరాలు ఏర్పాటు చేశారు.  అందులో 30 వేల కెమెరాలు కేవలం వరంగల్ ట్రై సిటీ పరిధిలోనే ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కేసుల ఛేదన, ప్రజల రక్షణ కోసం కెమెరాలు ఏర్పాటు చేస్తున్న పోలీసులు, వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేస్తున్నారు. పెద్దాఫీసర్లు కూడా మెయింటెనెన్స్​ బాధ్యతలు ఎవరికీ అప్పగించడం లేదు. ఫలితంగా ఆయా కెమెరాలు తరచూ రిపేర్లకు గురవుతున్నాయి. సిటీలో రోడ్ల వెంట ఉన్న కెమెరాలు పనికి రాకుండా పోయాయి.

కేసుల ఛేదనకు ఆటంకాలు..

ఒక్కో కెమెరాకు రూ.వేలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్న పోలీసులు.. వాటి నిర్వహణను విస్మరిస్తున్నారు. కెమెరాలు ఇన్ స్టాల్ చేసే క్రమంలో వాటి నిర్వహణ బాధ్యత ఆయా కంపెనీలకు ఒకట్రెండు సంవత్సరాలకు ఇస్తారు. కానీ ఇక్కడ కరాబైన కెమెరాలను మాత్రం పోలీసులు గుర్తించడం లేదు. అటు కంపెనీలు సైతం పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని పెద్దాఫీసర్లు సైతం లైట్ తీసుకుంటున్నారు.

కమాండ్ ​కంట్రోల్​ సెంటర్​కు కనెక్ట్ అయినా..

హైదరాబాద్​ నగరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను అక్కడి కమాండ్ కంట్రోల్ సెంటర్​(సీసీసీ)కు కనెక్ట్​చేస్తున్నారు. అంతకుముందే వరంగల్, హనుమకొండ కెమెరాలను హైదరాబాద్​సీసీసీకి అనుసంధానం చేశారు. మెయిన్​సెంటర్లలోని 55 కెమెరాలు రాజధానికి కనెక్ట్ అయి ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే చాలా వరకు కెమెరాలు నిద్రావస్థలోనే ఉన్నాయి. దీంతో కొన్ని మేజర్​ చోరీలు, యాక్సిడెంట్లు, ఇతర కేసుల్లో నిందితుల ఆచూకీ తెలుసుకోవడానికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  ఇకనైనా నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు  రిపేర్లు చేయించి నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

హనుమకొండ నక్కలగుట్ట ఏరియాలో చాలా రోజుల కింద పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో అవి పని చేయడం లేదు. సోమవారం మధ్యాహ్నం ఓ బైక్​ ఓవర్​ స్పీడ్​గా వచ్చి మరో బైక్​ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. యాక్సిడెంట్ చేసిన వారి కోసం పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. అవి పని చేయలేదు. ఇదే ఏరియాకు కొంతదూరంలో నిరుడు రూ.25 లక్షల భారీ చోరీ జరిగింది. మిట్టమధ్యాహ్నమే దొంగలు దోపిడీ చేసినా ఇంతవరకు వారిని గుర్తించలేదు. దీంతో సీసీ కెమెరాల పనితీరు, ఆఫీసర్ల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.