నెగెటివిటీని తట్టుకోవడం ఎలా?

నెగెటివిటీని  తట్టుకోవడం ఎలా?

శరీరానికి ప్రాణం ఎటువంటిదో, మనసుకు మాట అలాంటిది. మనసుకు ప్రతిబింబం లాంటిది మాట. భగవంతుడు మనిషికి మాట్లాడే శక్తిని ఇచ్చింది మంచి మాటలే మాట్లాడాలని. తనను తాను పొగుడుకుని, ఇతరులను నిందించే, బాధపెట్టే మాటలు మాట్లాడే వ్యక్తి శవంతో సమానం అని మన పురాణాలు వివరిస్తున్నాయి. ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి మంచిని కోరే మాటలే మాట్లాడాలి. శత్రువుతో అయినా సరే మంచి మాటలే మాట్లాడాలని చెబుతుంది ధర్మం. 

మాటతో ఒకరికి మేలు చేయలేకపోయినా పర్లేదు. కానీ.. అపకారం చేయకూడదు. ఒక్క మాటతో చనిపోయే వ్యక్తిని బతికించవచ్చు. అలాగే ఒకే ఒక్క మాటతో ఎంతో ఆనందంగా ఉన్న వ్యక్తిని మృత్యువు వైపు తోసేయొచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి.. మాట్లాడే మాటలు కూడా నెగెటివిటీని పెంచేలా ఉంటాయి. చులకన చేస్తూ మాట్లాడే మాటలు హృదయ వేదనను కలిగిస్తాయి. బయటివారు అంటే చుట్టాలు, స్నేహితులు అలా మాట్లాడితే ‘డోంట్ కేర్’ అని పట్టించుకోకుండా ఉండడం సాధ్యమేమో కానీ ఇంట్లోనే అలా ఉంటే తట్టుకుని నెగెటివిటీ ప్రభావం పడకుండా చేసుకోవడం మహాకష్టం. 

సోషల్ రాపో

మగవాళ్లకు బాధ కలిగినా బయటకు వెళ్లి ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చి లేదా ఫ్రెండ్స్​తో గడిపి వారి కష్టాన్ని మర్చిపోతారు. మనసును కుదుటపరుచుకుని వస్తారు. కానీ, ఆడవాళ్ల పరిస్థితి వేరు. ముఖ్యంగా గృహిణులు. ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండి ‘సోషల్ రాపో’ ఉన్న వాళ్ల సంగతి వదిలేస్తే, ‘ఇంట్రావర్ట్’గా ఉన్నవాళ్లు డిప్రెషన్‌‌లోకి వెళ్తారు. ఎవరు ఎలా ఉన్నా జీవిత భాగస్వామి అవమానించకుండా ఆలంబనగా ఉంటే, ఎవరైనా ఏదైనా అధిగమించొచ్చు. మా ఫ్రెండ్ ఒకమ్మాయికి టెన్త్​ పూర్తి కాగానే పెళ్లి చేశారు. ఆమె భర్తే ‘లా’ వరకూ చదివించాడు. ఆమెకు ట్విన్స్ పుట్టారు. వాళ్లు పెరిగాక, తను ఇప్పుడు జడ్జి అయ్యింది. మా అమ్మ ఫ్రెండ్ ఒకావిడకు టీచర్ అవ్వాలని కోరిక. కానీ.. అప్పట్లో చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేవారు. వాళ్లాయన టీచర్. పిల్లలు పెరిగేకొద్దీ అవసరం పెరుగుతుంది అనే విషయం చెబుతూ తనూ ప్రైవేటుగా పరీక్షలు రాసి, టీచర్​గా చేస్తానని అడిగితే.. ‘వద్దు’ అని ఒకసారి, ‘నీకు రాదులే!’ అని మరోసారి అని అడ్డువేశాడు. ఆమె ఆ కోరిక తీరకుండానే ఈ లోకం విడిచిపోయింది. 

వాళ్ల ధోరణి అంతే!

ఎంతోమందికి కించపరిచే స్వభావం ఉంటుంది. అలాంటివారి మాటకు విలువ ఎందుకు ఇవ్వాలి? అనే విషయం తర్కించుకోవాలి. వాళ్ల మాటలో నిజం ఎంతో కూడా ఆలోచించుకోవాలి. అలాగని వాళ్లను తిట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో వారైతే మనం వారి మాటల వల్ల బాధపడుతున్న విషయం చెప్పి తీరాలి. వారి ధోరణి మారకుంటే, పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అది సాధ్యపడడం కష్టమే! కానీ ప్రయత్నిస్తే అసాధ్యం కాదు. మనం ఒకరి మాటల గురించి పదేపదే ఆలోచిస్తున్నాం అంటే వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లే! అవి మంచి కోరే మాటలు కావచ్చు. బాధించే మాటలు కావచ్చు. బాధించాలని కంకణం కట్టుకుని మాట్లాడేవారి మాటలకు అంత విలువ ఇవ్వడం అవసరమా? ఇలా ఆలోచిస్తే తప్పకుండా నెగెటివిటీకి చెక్ పెట్టొచ్చు. ప్రతీ మనసు ఒక గుర్తింపును కోరుకుంటుంది. అది ఏ విషయంలోనైనా కావచ్చు. ఎవరి నుంచి అయినా కావచ్చు. ఆ గుర్తింపుకు బదులుగా నెగెటివ్ మాటలు వింటే బాధ.. అది పెరిగి డిప్రెషన్​కు దారితీస్తుంది. ముందుగా ఎవరికివారే సెల్ఫ్ ఐడెంటిటీ ఇచ్చుకోవాలి. అదే సైకాలజిస్ట్​లు చెప్పే సెల్ఫ్ రెస్పెక్ట్ కాన్సెప్ట్! ఎవరి మనసుకు వాళ్లు పాజిటివ్​ సజెషన్ ఇచ్చుకోవాలి. ప్రశాంతతను కలిగించే అంశాలు చదవొచ్చు. చూడొచ్చు. అక్కడ కూడా బాధ కలిగించే అంశాలు చూస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. 

నెగెటివిటీని జయించవచ్చు

ఎప్పటికప్పుడు చేసే పనులు మారుస్తూ మనసును రిపేర్ చేసుకుంటూ పోవాలి. ఒక్కముక్కలో చెప్పాలంటే...‘యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ అండ్ ట్రై టు మేక్ మైండ్ ఫ్రీ టు డూ యాజ్ పర్ ది సిచ్యుయేషన్’ మన చుట్టూ ఉన్న మనుషులను పరిశీలించి, ఒక అంచనాకు రావాలి. వాళ్ల మనస్తత్వాన్ని బట్టి ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలి. పట్టించుకోకుండా ఉండాలి. ఒక సామెత వినే ఉంటారు. ‘‘ఏనుగు వెళ్లేటప్పుడు ఎన్ని కుక్కలు మొరగవు!’’ అని. ఎన్ని కుక్కలు మొరుగుతూ వస్తున్నా.. అదీ బలమైన జంతువు అయి ఉండి కూడా పట్టించుకోకుండా తన మానాన తను వెళుతుంది ఏనుగు. అందరితో ఉంటూనే, ఆనందంగా పలకరిస్తూనే, మన మనసు మన నుంచి విడిపోకుండా చూసుకోవాలి. మనసును విడగొట్టి, అవతలి వారి మాటలు, చేష్టల చుట్టూ తిప్పకూడదు. అప్పుడు నెగెటివిటీని తప్పకుండా జయించవచ్చు. పాజిటివ్​నెస్ పెంచుకోవచ్చు. అది ఇతరులకు పంచవచ్చు. మనచుట్టూ పాజిటివ్ ‘ఆరా’ ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. సర్వేజనా సుఖినోభవంతు.
 

పాజిటివ్ దృక్పథం

స్వార్థం కావొచ్చు, అసూయ కావొచ్చు నెగెటివిటీ దృక్పథంతో మాట్లాడేవారు కోకొల్లలు. ఎవరో కొందరు అదృష్టవంతులకు అనుకూలమైన కుటుంబ సభ్యులు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరికైనా నెగెటివ్​ మాటల వల్ల బాధ కలగకమానదు. ఎందుకంటే మనం అన్నీ జయించిన సర్వసంగ పరిత్యాగులం కాదు కనుక. మామూలు గృహస్తులం. అయితే, మన పాజిటివ్ దృక్పథంతో ఎదుటివారి నుంచి వచ్చే నెగెటివిటీకి చెక్ పెట్టాలి. అందుకు సాధన చేయాలి. ఇంట్లోవాళ్లను ఎదిరించి మరీ వెళ్లి ఏదో సాధించడం అందరికీ సాధ్యం కాదు. ఒకవేళ అలా వెళ్లినా ఏదో సాధించేసి చాలా సినిమాల్లోలా గ్రేట్ సెలెబ్రిటీ అయిపోవడం కుదరని పని. అయితే, ఇది తట్టుకోవడం ఎలాగంటే.. మనం ఏ స్థితిలో ఉన్నామో ముందు ఆలోచించుకోవాలి. ఏ ఒక్కరి జీవితం మరొకరితో సమానంగా ఉండదు. ఒక బలీయమైన ఆలోచనా సరళిలో సామ్యం ఉన్నవారు ఆత్మీయులు అవుతారు. లేదంటే లేదు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. 

- సుధావిశ్వం