
కల గణాలకు అధిపతి.. తొలి పూజలు అందుకునే దేవుడు వినాయకుడు. అందుకే విఘ్నాలను తొలగించి, చల్లగా చూడాలని ప్రతి ఏడాది ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించి, దేవ రాత్రులు పూజలు చేసి నిమజ్జనం చేస్తుంటారు భక్తులు.ఈ తొమ్మిది రోజులు మండపాల్లో కొలువైన గణపయ్యకు పూలు, పండ్లు, కాయలు, ఆకులతో ఘనంగా పూజలు చేస్తారు. గణేశుడికి సమర్పించే ప్రతి దానికీ ఒక అర్ధం. చేసే ప్రతి పూజకు ఒక పరమార్థం ఉంది. అందుకే పూజా విధానం, ఆయన కథలు, ప్రత కల్పం లాంటివన్నీ ఇక్కడ ఇస్తున్నాం.
వినాయకుడిని ప్రతిష్ఠించే వాళ్లు ఇవన్నీ పాటిస్తే, పూజా ఫలితం దక్కుతుందని నమ్మకం. అంతేకాదు వినాయక వ్రతాన్ని స్వయంగా పరమశివుడే కుమారస్వామికి వివరించాడట. వినాయక చవితిరోజు ఈ వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సుఖాలు కలుగుతాయని నమ్మకం.
విఘ్నాధిపతి వినాయక
ముక్కోటి దేవుళ్లలో వినాయకుడు ప్రత్యేకం. త్రిమూర్తుల దగ్గర్నుంచి అందరు దేవుళ్ళూ వినాయకుడ్ని పూజించినవాళ్లే ఏ పని మొదలు పెట్టినా. 'ఏ విఘ్నాలూ రాకుండా చూడవయ్యా గణేశ!! అని వినాయకుడికే తొలిపూజ చేస్తారు. అలా మనం చేసే పనుల్లో అడ్డంకు లు రాకుండా, అన్ని విఘ్నాలను తొలగించే దేవుడు కాబట్టే, 'విమ్నాధిపతి' అన్న పేరుంది. వినాయకుడికి, శివుడు కూడా ఏదైనా పని మొద లుపెట్టే ముందు వినాయకుడికి పూజ చేస్తాడని పురాణాల్లో ఉంది. అలాంటి విఘ్నాధిపతికి ప్రతి ఏటా వైభవంగా జరిపే వినాయక చవితి. పండుగ వచ్చేసింది. ఈ పండుగకు వినాయకు దీని పూజించే పద్ధతిని, వ్రతం చేసే విధానాన్ని ఇవ్వాళ ప్రత్యేకంగా ఇస్తున్నాం..
వినాయక వ్రతం ఎలా చేయాలి..? ఏ శ్లోకం చదువుతున్నప్పుడు విఘ్నేశ్వరుడికి ఏపత్రం పుష్పం సమర్పించాలి..? వంటి వివరాలతో పాటు పూజ చేసే విధానం అంతా కింద అందించాం..
వ్రతం చేయాలనుకునే ప్రదేశంలో ఒక పీట వేయాలి. వినాయకుడి విగ్రహానికి పసుపు రాసి, తమలపాకుల చివర తూర్పు వైపుకు గానీ, ఉత్తరం వైపుకు గానీ ఉంచుకోవాలి. ఒక పళ్లెంలో బియ్యం పోసుకొని వాటిపై తమలపాకులను పెట్టుకోవాలి. దీపారాధన చేసిన తరువాత పీటపై వినాయకుడి విగ్రహాన్ని ఉంచుకొని, పాలవెల్లికి పసుపు రాసి, కుంకును బొట్లు పెట్టి, దాన్ని విఘ్నేశ్వరుని తలపై వచ్చేలా తాళ్లు కట్టి పైన అమర్చాలి.
పాలవెల్లిపై పత్రి వేసుకొని పాలవెల్లి నలువైపులా మొక్కజొన్న కండెలను కట్టుకొని, పండ్లతో అలంకరించాలి. వినాయకుడికి ఉండ్రాళ్లు.. కుదుములు, గారెలు, పాయసం వంటి పిండి వంటలు చేసుకొని దగ్గర పెట్టుకోవాలి.. వినాయకుడి విగ్రహం ఎదురుగా పీటపై కాసిన్ని బియ్యం పోసి.. దానిపై రాగి, వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి, పాత్రపై జాకెట్ ముక్క పెట్టి, కొన్ని మామిడాకులు ఉంచాలి. దాని పైన కొబ్బరికాయ ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.