గుడి, బడికి సమీపంలో బార్​ అండ్​ రెస్టారెంటా? ఎలా అనుమతి ఇచ్చారు? :హైకోర్టు

గుడి, బడికి సమీపంలో బార్​ అండ్​ రెస్టారెంటా?  ఎలా అనుమతి ఇచ్చారు? :హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, హయత్‌నగర్‌  నుంచి సాహెబ్‌ నగర్‌కు వెళ్లే మెయిన్‌ రోడ్‌లో నివాస ప్రాంతంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు అనుమతి ఎలా ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వెంటనే  వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.  సాయి యువ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుకు అనుమతిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన చీఫ్‌ సెక్రటరీ, ఎక్సైజ్, హోం శాఖల ముఖ్యకార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ, ఎక్సైజ్‌ శాఖ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాచకొండ పోలీసు కమిషనర్, హయత్​నగర్ ఎస్‌ఏహెచ్‌ఓలను ఆదేశించింది. తమ కాలనీ నివాసాల మధ్య ప్రధాన రహదారిపై బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఉందని, దీని వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఆరో తరగతి స్టూడెంట్‌ ఆర్‌ వైష్ణవి హైకోర్టుకు లేఖ రాసింది. అక్కడి ఆలయానికి వెళ్లడానికి భక్తులు.. ప్రధానంగా మహిళలు ఇబ్బందులుపడుతున్నారని, కొందరు మద్యం తాగి వీరంగం చేస్తున్నారని, జనావాసాల మధ్య మద్యం దుకాణంపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నది.  దీనిని హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి, విచారణ చేపట్టింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే అనిల్‌కుమార్​తో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.