Chandrayaan-3: ఆ 18 నిమిషాలు నరాలు తెగే ఉత్కంఠ.. 18 మినిట్స్ ఆఫ్ టెర్రర్

Chandrayaan-3: ఆ 18 నిమిషాలు నరాలు తెగే ఉత్కంఠ.. 18 మినిట్స్ ఆఫ్ టెర్రర్

ఇండియా అంతా ఒకే ఒక్క మాట.. చంద్రయాన్.. చంద్రుడిని ముద్దాడే అద్భుత ఘట్టంపై నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. మరికొన్ని గంటల్లోనే చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియ కాబోతుంది. ఇందులో కీలకమైన టైం ఏంటో తెలుసా.. ఆ 18 నిమిషాలు.. అవును.. చంద్రయాన్ శాటిలైట్.. చంద్రుడిపై దిగటానికి ఫిక్స్ చేసిన టైం. ఈ 18 నిమిషాలు అనుకున్నది అనుకున్నట్లు జరగాల్సి ఉంది. ఏ ఒక్క సెకన్ తేడా రాకుండా చూసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు అందరూ కూడా.. ఆ 18 నిమిషాలను ఇస్రో సైంటిస్టులు ఏ విధంగా ఆపరేట్ చేయబోతున్నారు.. సేఫ్ ల్యాండింగ్ ఎలా చేయబోతున్నారు అనేది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

2023, ఆగస్టు 23, బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఈ చంద్రయాన్-3 మిషన్.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్-3 జర్నీలో.. ఈ 40 రోజుల ప్రయాణం ఒక ఎత్తైతే... ల్యాండింగ్ ప్రక్రియ జరిగే చివరి 18 నిమిషాలు మరో ఎత్తు అన్నమాట. దశల వారీగా ఈ ల్యాండింగ్ ప్రక్రియ జరగనుంది. మొదట చంద్రయాన్ 3లోని బూస్టర్లను మండించడం ద్వారా దాన్ని చంద్రుడి కక్ష్య నుంచి ఉపరితలం వైపు పడేలా చేస్తారు. అక్కడి నుంచి ప్రతి క్షణం నరాలు తెగే ఉత్కంఠ మొదలవుతుంది.

దశల వారీగా ల్యాండింగ్ ప్రక్రియ

  • మొదట చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యే ప్రదేశానికి 745 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
  • అక్కడ నుంచి సెకనుకు.. 1.6 కిలోమీటర్ల వేగంతో.. 30 కిలోమీటర్ల కిందకు దిగుతుంది.
  • ఇదంతా 690 సెకన్లలో జరుగుతుంది.
  • చంద్రయాన్ 3లోని ఇంజన్లు ఆన్ అవుతాయి.
  • సైకిల్ బ్రేక్స్ వేసినట్లు.. స్పీడ్ తగ్గించుకుంటూ.. తనకు తాను కంట్రోల్ చేసుకుంటూ నిదానంగా కిందకు దిగుతుంది.
  • ఈ ప్రక్రియలో ల్యాండింగ్ ప్రాంతానికి 32 కిలోమీటర్ల దూరంలో.. చంద్రుడి ఉపరితలానికి 7.5 కిలోమీటర్ల దూరంలో ఆగుతుంది.
  • ల్యాండింగ్ స్పాట్ సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి ఇదే సరైన సమయం. ఆ ప్రాంతం అనుకూలంగా ఉందా లేదా అనేది సెన్సార్లు ఎప్పటికి కప్పుడు సమాచారాన్ని ఇస్తూనే ఉంటాయి.
  • అనంతరం చంద్రుడి ఉపరితలానికి 6.8 కి.మీల ఎత్తుకు చేరుకున్న తర్వాత ల్యాండర్‌ తన రెండు ఇంజిన్లను ఆఫ్‌ చేసి.. మరో రెండు ఇంజిన్లనే ఉపయోగించుకుని వేగాన్ని తగ్గించుకుంటుంది. ఈ సమయంలోనూ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలానికి సమాంతరంగానే ఉంటుంది.
  • ఆపై ల్యాండర్‌ ఫైన్‌ బ్రేకింగ్‌ దశలోకి అడుగుపెడుతుంది. ఈ దశలో విక్రమ్ ల్యాండర్ నిటారు(90 డిగ్రీల కోణం)గా మారుతుంది, 
  • అలా క్రమక్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ చంద్రుడి ఉపరితలానికి 800-1300 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది.
  • అనంతరం సుమారు 12 సెకన్లలో మరింత కిందకు దిగి 150 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. 
  • అప్పుడు మరోసారి ల్యాండింగ్‌ కోసం ఎగుడు దిగుళ్లు, బండరాళ్లు లేని ప్రదేశం కోసం అన్వేషిస్తుంది. ల్యాండింగ్ స్పాట్ లో ఏవైనా సమస్యలుంటే.. విక్రమ్ ల్యాండర్ 150 మీటర్లు ముందుకు వెళ్లి మళ్లీ ప్రయత్నిస్తుంది.
  • అన్నీ సజావుగా ఉంటే తదుపరి 73 సెకన్లలో ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెడుతుంది. 
  • దీంతో టెన్షన్‌కు తెరపడి ప్రయోగం విజయవంతమవుతుంది.