మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మారువేషాల్లో కాలేజీలోకి ప్రవేశించి ర్యాగింగ్ చేస్తున్న ఆకతాయిలను పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ లోని ఓ మహిళా పోలీస్.. ర్యాగింగ్ కేసు విచారణలో భాగంగా కాలేజ్ స్టూడెంట్ గా మారారు. మహాత్మాగాంధీ మెమోరియల్ వైద్య కళాశాలలో ఫస్టియర్ ఎంబీబీఎస్ విద్యార్థులను కొందరు ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారు. దీంతో ఓ విద్యార్థి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేశారు. అధికారులు ఈ కేసును మహిళా పోలీస్ షాలినికి అప్పగించారు. ర్యాగింగ్ కేసు అనుమానితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన షాలిని చౌహాన్.. అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టింది.
అందుకోసం ఏకంగా కాలేజీ స్టూడెంట్‌గా మారింది. బీకామ్ చదివిన ఆమె నర్సుగా కాలేజీలో ఎంటర్ అయింది. ఆమెతో పాటు మరో పోలీస్ అధికారిని కాలేజీ విద్యార్థినిగా వెళ్లింది. వీరితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను కాలేజ్ క్యాంటీన్ వర్కర్లుగా పంపించారు. సీక్రెట్ ఆపరేషన్ ద్వారా 11 మంది సీనియర్ విద్యార్థులను షాలిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాళ్లపై సీఆర్‌పీఎఫ్ 41ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 11 మంది విద్యార్థులను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో, పలువురు షాలినిని అభినందిస్తున్నారు.

