సివిల్‌‌ వివాదాల్ని హెచ్‌‌ఆర్‌‌సీ విచారించకూడదు: హైకోర్టు

సివిల్‌‌ వివాదాల్ని హెచ్‌‌ఆర్‌‌సీ విచారించకూడదు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఆస్తులకు సంబంధించిన సివిల్‌‌ వివాదాలపై విచారించే అధికారం స్టేట్‌‌ హ్యూమన్‌‌ రైట్స్‌‌ కమిషన్‌‌(హెచ్‌‌ఆర్‌‌సీ)కి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో ఓ విల్లా నిర్మాణ వివాదంపై హెచ్‌‌ఆర్‌‌సీ ఇటీవల స్టేటస్‌‌ కో ఆర్డర్‌‌ ఇచ్చింది. దీన్ని సవాల్‌‌ చేస్తూ ఎం.శ్రీహరితో పాటు మరో ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​ను  చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ టి.వినోద్‌‌కుమార్‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం విచారించింది.

పిటిషనర్‌‌ తరఫు లాయర్ వాదిస్తూ.. మాణిక్యమ్మ వర్సెస్‌‌ రౌద్రి కో ఆపరేటివ్‌‌ హౌసింగ్‌‌ సొసైటీ లిమిటెడ్‌‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా స్టేట్ హెచ్‌‌ఆర్‌‌సీ ఉత్తర్వులిచ్చిందని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ సివిల్‌‌ వివాదం హెచ్‌‌ఆర్‌‌సీ పరిధిలోకి రాదని వెల్లడించింది. పరిధి దాటి ఇచ్చిన స్టేటస్‌‌కో ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ.. పిటిషన్‌‌పై విచారణను ముగించింది.