
- నవరాత్రుల్లో 35 శాతం వృద్ధి.
- గత నెల 6 శాతం పెరుగుదల
- వెల్లడించిన ఫాడా
న్యూఢిల్లీ:ఈ ఏడాది నవరాత్రుల సమయంలో వాహనాలు విపరీతంగా అమ్ముడుపోయాయి. ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 35 శాతం పెరిగాయి. సెప్టెంబరులో బండ్ల రిజిస్ట్రేషన్లు 6 శాతం పెరిగాయి. గత నెల మొదటి 21 రోజుల్లో మాత్రం అమ్మకాలు మందగించాయి. సెప్టెంబర్ 22న కొత్త జీఎస్టీ రేట్లను ప్రకటించాక వెహికల్స్ అమ్మకాలు ఊపందుకున్నాయని ఫెడరేషన్ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) మంగళవారం (అక్టోబర్ 07) తెలిపింది.
పండుగ కాలంలో మొత్తం 2,17,744 ప్యాసింజర్ వెహికల్స్ రిటైల్ అమ్ముడయ్యాయి. ఇవి గత ఏడాది నవరాత్రి పండగ సమయంలో అమ్ముడైన 1,61,443 యూనిట్లతో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ బంపర్ సేల్‌తో సెప్టెంబర్‌లో పీవీల అమ్మకాలు 2,99,369 యూనిట్లకు పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 2,82,945 యూనిట్లతో పోలిస్తే ఇవి 6 శాతం ఎక్కువ.
‘‘భారత ఆటోమొబైల్ పరిశ్రమకు సెప్టెంబర్ ఒక అసాధారణ నెల. జీఎస్టీ రేట్లు తగ్గుతాయి కాబట్టి మొదటి మూడు వారాలు కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. నవరాత్రి ఉత్సవాలు, జీఎస్టీ కొత్త రేట్ల అమలుతో చివరి వారంలో మార్పు వచ్చింది. కస్టమర్ల సెంటిమెంట్ పెరిగి, వెహికల్స్ డెలివరీలు వేగవంతం అయ్యాయి’’ అని ఫాడా ఉపాధ్యక్షుడు సాయి గిరిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం అన్ని విభాగాల్లో సానుకూల వృద్ధి కనిపించింది. మొత్తం మీద 5 శాతం వృద్ధి నమోదయింది. ఈ ఊపు దీపావళి వరకు కొనసాగుతుందని ఫాడా తెలిపింది.
7 శాతం పెరిగిన టూవీలర్సేల్స్
గత నెలలో 12,87,735 టూవీలర్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్ 2024లో అమ్ముడైన12,08,996 యూనిట్లతో పోలిస్తే ఇది 7 శాతం వృద్ధి. నవరాత్రి పండుగ కాలంలో అమ్మకాలు 36 శాతం పెరిగి 8,35,364 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో 6,14,460 యూనిట్లు అమ్ముడయ్యాయి. త్రీవీలర్స్ అమ్మకాలు 1,06,534 యూనిట్ల నుంచి 98,866 యూనిట్లకు పడిపోయాయి. నవరాత్రి పండుగ కాలంలో రిటైల్ అమ్మకాలు 25 శాతం పెరిగి 46,204 యూనిట్లకు చేరాయి.
అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 37,097 యూనిట్లు అమ్ముడయ్యాయి. కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు గత నెలలో 3 శాతం పెరిగి 72,124 యూనిట్లుగా నమోదయ్యాయి. ట్రాక్టర్ రిటైల్ అమ్మకాలు నాలుగు శాతం ఎగిసి 64,785 యూనిట్లకు చేరుకున్నాయి. నవరాత్రి సమయంలో రిటైల్ అమ్మకాలు 19 శాతం పెరిగి 21,604 యూనిట్లకు చేరాయి. గత నెలలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం అమ్మకాలు 18,27,337 యూనిట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 2024లో 17,36,760 యూనిట్లతో పోలిస్తే ఇవి 5 శాతం ఎక్కువ.
నవరాత్రి అమ్మకాలు 34 శాతం పెరిగి 11,56,935 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది 8,63,327 యూనిట్లు మాత్రమే సేల్అయ్యాయి. ఈ ఏడాది భారీ వర్షాలు, పంటలు బాగుండటం, తక్కువ రేట్లు కస్టమర్లు కొనుగోలు శక్తిని పెంచాయని ఫాడా తెలిపింది.