- టీటీడీ తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ
- ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ దంపతులు, సబ్ కలెక్టర్
కాగజ్ నగర్, వెలుగు: కౌటాలలోని కంకలమ్మ కేతేశ్వర స్వామి ఆలయం జనసంద్రంగా మారింది. 24వ మహా జాతరను పురస్కరించుకొని రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 5 గంటలకు కంకలమ్మ కేతేశ్వరులకు ఆలయ కమిటీ చైర్మన్ సుల్వ కనకయ్య, కల్యాణి దంపతుల ప్రత్యేక పూజలతో జాతర ప్రారంభమైంది.
అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కుంకుమార్చన నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున హిందూ ధర్మ ప్రచార సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి గొల్లపల్లి సత్యనారాయణ, టీటీడీ అధికారి రామనాథం, సభ్యుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అమ్మవారికి, కేతేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కలెక్టర్వెంకటేశ్ ధోత్రే దంపతులు, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ కమిటీ చైర్మన్ సుల్వ కనకయ్య ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. జాతరకు దాదాపు 30 వేల మంది భక్తులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాగజ్ నగర్ డీఎస్పీ వహీదుద్దిన్ పర్యవేక్షణలో కౌటాల సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు చంద్రశేఖర్, సందీప్ కుమార్, నరేశ్, కల్యాణ్, శ్రీకాంత్ బందోబస్తు నిర్వహించారు.
