ప్లీజ్ సార్..ఒక్క అడ్మిషన్ ఇవ్వండి

ప్లీజ్ సార్..ఒక్క అడ్మిషన్ ఇవ్వండి

ప్లీజ్ సార్ మాకు ఒక్క అడ్మిషన్ ఇవ్వండి..ఇది ఏదో ప్రైవేట్ పాఠశాలలో వినిపిస్తున్న మాట కాదు..ప్రభుత్వ పాఠశాలలోనే. అవును సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ స్కూల్లో వినిపిస్తున్న మాట ఇది. ఎంతోమంది విద్యార్థులు ఈ పాఠశాలలో అడ్మిషన్ కోసం క్యూ కడుతున్నారు. ఒక్క సీటు ఇవ్వాలంటూ స్కూల్ హెడ్ మాస్టర్ ను కోరుతున్నారు. అయితే 6వ తరగతిలో ఉన్న 160 సీట్ల కోసమే అడ్మిషన్లు తీసుకుంటున్నామని..మొదట ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు హెచ్ఎం తెలిపారు. ఆ తర్వాతే ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. టీచర్లు సరిపడా లేకపోవడంతో అందరికీ అడ్మిషన్స్ ఇవ్వలేమని హెచ్ఎం స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం ఈ స్కూల్లో 1230మంది ఉన్నారు. 

ఈ బడికి ఎందుకు అంత డిమాండ్

సకల హంగులతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఆదర్శంగా నిలుస్తోంది ఈ పాఠశాల. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంగ్లీష్ బోధన కూడా ఉండడంతో విద్యార్థులు ఈ పాఠశాలకు క్యూ కడుతున్నారు. ఈ సారే కాదు ప్రతి సారి ఈ స్కూల్లో ఇదే పరిస్థితి. నో అడ్మిషన్స్ అని బోర్డు పెట్టే సన్నివేశం ఈ పాఠశాలలోనే ప్రత్యేకంగా కన్పిస్తుంటుంది.  సాధారణంగా సర్కార్ బడి అంటే సదువు సరిగ్గా ఉండదనే అనే భావన ప్రజల్లో ఉంటుంది. దానిని ఈ పాఠశాల బ్రేక్ చేస్తోంది. అడ్మిషన్ల కోసం టీచర్లు తిరిగే రోజుల నుండి విద్యార్థుల తల్లిదండ్రులే అడ్మిషన్ కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితిని ఈ స్కూల్ తీసుకొచ్చింది.  ఇక ఈ పాఠశాలలో అడ్మిషన్ కోసం కొందరు తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు,అధికారులతో రికమండేషన్లు చేయిస్తున్నారని కూడా సమాచారం.