మిల్లెట్స్​కు పెరిగిన క్రేజ్

మిల్లెట్స్​కు పెరిగిన  క్రేజ్
  • కరోనా సెకండ్​వేవ్​ తర్వాత వీటిని తినేవాళ్ల సంఖ్య డబుల్
  • కస్టమర్ల డిమాండ్​ను బట్టి మార్కెట్లో వెరైటీలు

హైదరాబాద్, వెలుగు: కరోనాతో ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జనాల్లో అవగాహన పెరిగింది. రోజూ తీసుకునే ఆహారంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు తినేందుకే ఇష్టపడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇది మరింత పెరిగింది. వీటిల్లో ‘రెడీ టు ఈట్ మిల్లెట్​ప్రొడక్ట్స్’ కొనేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. కరోనాకు మందుకు రెడీ టు ఈట్ మిల్లెట్​ప్రొడక్ట్స్​కొనేవారు 20 శాతం మంది ఉంటే ప్రస్తుతం డబుల్ అయ్యారని అంటున్నారు. 

వండుకోవడం కష్టమని..

మిల్లెట్స్​పై అవగాహన ఉన్నప్పటికీ వీటిని వండుకుని తినేందుకు వెనుకడుగు వేస్తున్నారని షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా రైస్​కు అలవాటు పడిన జనం క్రమంగా వీటి వైపు వస్తున్నారు. చాలా మంది మిల్లెట్స్ ను ఎలా వండుకోవాలో తెలియక, రుచి ఎలాంటుందో అనే భయంతో కొనేందుకు ఆలోచిస్తున్నారు. కానీ ఆర్గానిక్ కూరగాయలు, పండ్లకు  గతంలో కంటే ఆదరణ పెరిగిందని చెబుతున్నారు. జనాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో సిటీలో సెకండ్ వేవ్ తర్వాత మిల్లెట్స్, ఆర్గానిక్ స్టోర్లు కూడా పెరిగాయి. 

40 శాతం మందికి ఇవే

రెడీమేడ్ ఆర్గానిక్, మిల్లెట్స్ స్నాక్స్, పౌడర్స్ కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో సజ్జ కుకీస్, రాగి కుకీస్, మిల్లెట్ మిక్చర్, మిక్స్‌‌‌‌డ్ మిల్లెట్ మిక్చర్, మిల్లెట్స్ పౌడర్, ఎనర్జీ డ్రింక్ ప్రొడెక్ట్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయని స్టోర్ల నిర్వాహకులు చెబుతున్నారు. రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ కొనేవారు గతంలో 20 శాతం మంది ఉంటే ప్రస్తుతం  40శాతానికి పెరిగారని అంటున్నారు. 300 గ్రాముల కుకీస్ 150 రూపాయలు, 250 గ్రాముల మిక్చర్ 90 రూపాయలకు అమ్ముతున్నారు. జనం ముఖ్యంగా అండు కొర్రలు, సామలు, ఉదలు, అరికెలు, సజ్జలు వంటి వాటిని తింటున్నారు. వీటిలో ఉండే ప్రొటీన్లు, పీచు, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రాగులు, సజ్జలు, రోజూ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని న్యూట్రిషనిస్ట్ డా.సుష్మా సూచించారు.