లాక్ డౌన్ తో బట్టల బిజినెస్ డీలా..

లాక్ డౌన్ తో బట్టల బిజినెస్ డీలా..

మోస్ట్ ఫ్యాషనబుల్ సిటీల్లో హైదరాబాద్ ఒకటి. ఇక్కడి జనానికి ఫ్యాషన్ కాన్షియస్ ఎక్కువ. నయా ట్రెండ్స్ బాగా ఫాలో అవుతుంటారు. ఫెస్టివల్స్​కే కాదు, వీకెండ్​లోనూ షాపింగ్ మాల్స్, క్లాత్ స్టోర్స్ కిటకిటలాడుతుంటాయి. బట్టల బిజినెస్ కోట్లలో సాగుతుంది. అలాంటిదిప్పుడు లాక్ డౌన్ తో ఊహించనంత నష్టాల్లోకి వెళ్లామని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. స్టాక్ అంతా అలాగే ఉండిపోయిందని, ఇప్పట్లో కోలుకవడం కష్టమని వాపోతున్నారు.

మరో మూణ్నెళ్లు కష్టమే…

సిటీవ్యాప్తంగా క్లాత్, రిటైల్, బ్రాంచ్ స్టోర్లు వందల్లో ఉన్నాయి. ఇప్పుడవన్నీ మూతపడ్డాయి. కమర్షియల్ స్పేస్ లో బిజినెస్ చేసేవారు అద్దెలకు, స్టాఫ్ కి శాలరీలకు ఇబ్బందులు పడుతున్నారు. 3 నెలలపాటు రెంట్​అడగొద్దని ప్రభుత్వం చెప్పినా ఓనర్స్ వినడం లేదని వ్యాపారులు చెప్తున్నారు. లాక్​డౌన్​ ముగిసిన తర్వాత ఉన్న స్టాక్ నే అమ్మాల్సి ఉంటుందని స్టోర్స్​ నిర్వాహకులు అంటున్నారు. ఇంకో 3 నెలలు ఆర్థికంగా కోలుకోలేమని, ప్రొడక్షన్ కూడా ఉండదని చెబుతున్నారు. క్లాత్ స్టోర్స్ కి మెటీరియల్, ఫ్యాబ్రిక్ చైనాతో వివిధ దేశాల నుంచి ఎక్కువగా వస్తుందని, ఇప్పుడు ఎక్కడికక్కడ ప్రొడక్షన్ ఆగిపోయిందని తెలిపారు. సీజనల్​గా స్టైల్స్​లో, డిజైన్స్ లో మార్పులు సహజమని, ఈసారి మాత్రం అసలు బిజినెస్ జరగలేదు కాబట్టి ఉన్న మెటీరియల్ నే సేల్ చేస్తామని తెలిపారు. ఉద్యోగాల్లో కోత, జాబ్​ చేస్తున్న వారికీ పూర్తి శాలరీ అందకపోవడంతో ఎంప్లాయీస్ కూడా షాపింగ్  చేసే పరిస్థితి పెద్దగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు.