భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శనివారం భద్రతాబలగాలు శనివారం మావోయిస్టులకు చెందిన భారీ డంపును స్వాధీనం చేసుకున్నాయి. జిల్లాలోని మద్దేడ్ పోలీస్‌స్టేషన్ పరిధి బందేపారా-నీలమడుగు గ్రామాల మధ్య అడవుల్లో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్‌కు వెళ్లాయి. తనిఖీలు నిర్వహిస్తుండగా మావోయిస్టుల డంప్ కన్పించింది. వెంటనే బాంబ్ డిస్పోజల్ టీమ్‌లను రంగంలోకి దించారు.
డంప్‌ను తెరవగా అందులో 16 ప్రెషర్ బాంబులు, వంద కిలోల బరువు కలిగిన 784 జిలిటిన్ స్టిక్స్, 3 బండిళ్ల ఎలక్ట్రిక్ వైరు, 350 మీటర్ల యూనిఫాం కుట్టేందుకు తెచ్చిన క్లాత్, కిలో గన్‌పౌడర్, వాకీటాకీలు 4, బ్యాటరీలు 4, మొబైల్ఛార్జర్లు 2, విప్లవసాహిత్యం, బియ్యం, నూనె, సబ్బులు, కిట్బ్యాగులతో కూడిన భారీ సంఖ్యలో వస్తువులు దొరికాయి. వెంటనే బీడీఎస్ టీం 16 ప్రెషర్ బాంబులను నిర్వీర్యం చేసింది. మద్దేడు పోలీస్‌స్టేషన్‌కు వాటిని తరలించారు.
