భద్రత డొల్లేనా? ఐదంచెల భద్రత దాటి ఎలా వచ్చారు?

భద్రత డొల్లేనా?  ఐదంచెల భద్రత దాటి ఎలా వచ్చారు?

ఢిల్లీ: కేంద్ర బలగాలు, నిఘావర్గాల అలెర్ట్ లు ఐదంచెల భద్రత దాటుకొని ఆగంతకులు  ఎలా పార్లమెంటు భవనంలోకి ప్రవేశించారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  లోక్ సభలో టియర్ గ్యాస్ ప్రయోగించిన నిందితులకు మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ పేరు మీద పాస్ జారీ అయినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనతో మొత్తం నలుగురికి సంబంధం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హౌజ్ లోపల విజిటర్ గ్యాలరీ నుంచి హాల్‌లోకి దూకిన ఆనంద్ సాగర్‌ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వెంటే ఉన్న దేవరాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లిద్దరూ కర్నాటక కు చెందిన వారు మైసూర్ ఎంపీ ప్రతాప్ సిన్హా జారీ చేసిన విజిటర్ పాస్ పై సభలోని విజిటర్స్ గ్యాలరీకి వచ్చారు.  హర్యానాకు చెందిన నీలమ్ (42) అనే మహిళతో పాటు మహారాష్ట్రకు చెందిన అమోల్ షిండే (25) పార్లమెంట్ బయట టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. వీరినీ అదుపులోకి తీసుకుని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ‘తానాషాహీ.. నహీ చలేగీ.. తానాషాహీ బంద్ కరో(నల్ల చట్టాలు బంద్ చేయండి).. వందేమాతరం.. భారత్ మాతా కీ జై..’ అంటూ వీరిద్దరూ పార్లమెంట్ బయట నినాదాలు చేశారు.   

ఎలా వచ్చారంటే.. 

లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు చూడటానికి వెళ్లాలన్నా.. గ్యాలరీలోకి వెళ్లాలన్నా కనీసం రికమండేషన్ లెటర్ ఉండాలి.. మీడియా అయినా పార్లమెంటు జారీ చేసే అక్రడిటేషన్ కార్డు తప్పక ఉండాలి. గ్యాలరీలోకి వెళ్లాలంటే ఎంపీల సిఫార్సు లేఖ ఉండాల్సిందే. ఎంపీల పీఏలకు ప్రత్యేక ధృవీకరణ కార్డులు ఉంటాయి.. పార్లమెంట్ ఆవరణలోకి ఎవరు పడితే వాళ్లు.. ఎలా పడితే అలా వెళ్లటానికి అవకాశం ఉండదు. అయితే  గ్యాస్ వదిలిన నిందితులు కర్ణాటకలోని మైసూరుకు చెందిన  బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా  విజిటింగ్ పాస్ తో లోపలికి వచ్చారని తెలుస్తోంది.  దీంతో పాస్ జారీ చేసిన ఎంపీ ప్రతాప్ సిన్హా పేషీలోని వారిని  పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. లోక్ సభలో వదిలిన టియర్ గ్యాస్  రిలీజ్ చేసిన ఘటనై విచారణకు ఆదేశించినట్లు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఈ ఘటన అనంతరం సభలో మాట్లాడిన ఆయన సభలోకి ప్రవేశించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పోలీసులకు వివరాలు అందించామన్నారు. సభలో వదిలిన పొగ ప్రమాదకరమైనది కాదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అది కలర్ స్మోక్  అని ఎంపీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.  

నాదే బాధ్యత: స్పీకర్ ఓం బిర్లా

‘లోక్‌సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నాం. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతాం. ఆ పూర్తి బాధ్యత నాదే. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దానిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిందితులు వదిలిన గ్యాస్‌ ఏమిటనే దానిపై సమగ్ర విచారణ జరుపుతాం. దీనిపై ఈ సాయంత్రం సమావేశం నిర్వహిస్తాం. సభ్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటాం’అని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే.. సభ సజావుగా నిర్వహించడం మనందరి బాధ్యత అని స్పీకర్‌ అన్నారు.