లష్కర్ వారానికి పోటెత్తిన భక్తులు..మల్లన్న నామస్మరణతో మారుమోగిన కొమురవెల్లి

లష్కర్ వారానికి పోటెత్తిన భక్తులు..మల్లన్న నామస్మరణతో మారుమోగిన కొమురవెల్లి

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఉత్సవాల్లో భాగంగా లష్కర్‌‌ వారానికి (రెండో ఆదివారం) భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయ ప్రాంగణంలోని గంగిరేగు చెట్టు, రాజగోపురం, రాతిగీరలు, కోడెల స్తంభం, తోటబావి, ఎల్లమ్మ కమాన్, బస్టాండ్ ప్రాంగణం, సినిమా టాకీస్ ప్రాంగణం, మల్లన్న చెరువు పార్కింగ్ స్థలం కిక్కిరిసిపోయింది. భారీగా తరలివచ్చిన భక్తులు ముందుగా స్వామివారికి తలనీలాలు సమర్పించి, మల్లన్న కోనేరులో స్నానాలు చేశారు.

 బోనాలు, డప్పుచప్పుళ్లతో వచ్చి, గంగిరేగు చెట్టు వద్ద బోనాలు పెట్టి, పట్నాలు వేసి మల్లన్నకు మొక్కులు సమర్పించిన అనంతరం మల్లన్నను దర్శించుకున్నారు. రద్దీకారణంగా స్వామివారి ధర్మదర్శనానికి సుమారు ఐదు గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటలు పట్టింది. ఆదివారం ఒక్క రోజే సుమారు 50 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. హుజూరాబాద్‌‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌రెడ్డి, సికింద్రాబాద్‌‌ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌‌ కుటుంబ సభ్యులతో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు, ఆఫీసర్లు ప్రసాదం అందజేశారు.