- కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై స్మృతి ఇరానీ ఫైర్
- రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని మహిళలకు సూచన
బెంగళూరు: కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పరిస్థితిపై కేంద్రమంత్రి, బీజేపీ లీడర్ స్మృతి ఇరానీ సెటైర్లు వేశారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ వయనాడ్‌లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా అన్నీ రాజాను నిలబెట్టిందని తెలిపారు. రాహుల్ వయనాడ్‌లో ఎందుకు పోటీ చేస్తున్నారని లెఫ్ట్ పార్టీలే ప్రశ్నిస్తున్నాయని ఎద్దేవా చేశారు. శుక్రవారం బెంగళూరులో వ్యాపారవేత్తలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
"వయనాడ్‌లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పరిస్థితి దారుణంగా ఉంది. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి ఎందుకు పోటీ చేయట్లేదని వామపక్షాలే ప్రశ్నిస్తున్నాయి. కానీ అదే వామపక్ష నేతలు ఇండియా కూటమి సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లినప్పుడు రాహుల్ గాంధీని కౌగిలించుకుంటున్నారు. కేరళ, కర్నాటకలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పరిస్థితి.. ఢిల్లీ మే హగ్గింగ్, కేరళ మే బెగ్గింగ్, కర్నాటక మే థగ్గింగ్ లెక్క ఉంది" అని స్మృతి ఇరానీ సెటైర్ వేశారు. వయనాడ్ లో రాహుల్ పోటీ చేయడాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ తప్పుబట్టారని ఆమె గుర్తుచేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు భారీ సంఖ్యలో బీజేపీకి ఓట్లు వేయాలని స్మృతి ఇరానీ అభ్యర్థించారు.
ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామన్న కాంగ్రెస్ కామెంట్లపై స్మృతి ఇరానీ స్పందించారు. రాజ్యాంగాన్ని తగలబెడతామన్న డీఎంకేతో కలిసి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తుందని ప్రశ్నించారు.1980లో డీఎంకే నేతలు రాజ్యాంగ ప్రతులను తగులబెట్టారని ఆమె గుర్తుచేశారు. కేరళలో కాంగ్రెస్ నిషేధిత పీఎఫ్‌ఐ మద్దతును తీసుకుందని.. దాని సాయంతో దేశంలో ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించగలదని నిలదీశారు. ఎన్‌డీఏ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ అని.. మరి ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని కోరారు. బీజేపీకి ఓటేస్తే ప్రజాస్వామ్యానికి, అభివృద్ధికి ఓటేయడమేనని స్మృతి ఇరానీ పేర్కొన్నారు.