అనాదిగా మనిషికి పాటతో ప్రత్యేక అనుబంధం ఉంది. శ్రమను మర్చిపోవడానికి, సంతోషాన్ని పంచుకోవడానికి పుట్టిన పాట క్రమంగా అనేక హంగులద్దుకుంది. శ్రుతి, లయ, బాణీలతో సరికొత్త రూపు సంతరించుకుంది. నవరసాలను నింపుకుంది. అయితే, కేవలం రంజింపజేయడం మాత్రమే పాట లక్ష్యం కాదు. ఆలోచింపచేయాలి.
అన్యాయాలను, అక్రమాలను ఎదిరించాలి. అసమానతలను ప్రశ్నించాలి. అభివృద్ధికి బాటలు వేయాలి. ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలవాలి. అలాంటి పాటలు రాసి తమ కలంతో, గళంతో తెలంగాణ ప్రజల గుండె గొంతుకగా నిలిచారు గద్దర్, గూడ అంజయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న తదితరులు. ఆ వరుసలో వినిపిస్తున్న మరో పేరు కె.ఆనందాచారి అనడంలో అతిశయోక్తి లేదు. కవి, కార్టూనిస్టు, రచయిత, సంపాదకులు అయిన ఆనందాచారి.. ఉద్యమంలో, వృత్తి జీవితంలో ఎన్నో పాటలు రాశారు. వాటన్నిటిని ఒకచోట చేర్చి తీసుకొచ్చిన పుస్తకమే ‘ఉద్యమ బాటలో నా పాట’.
ప్రజా పోరాటాలకు చిరునామా తెలంగాణ. ఇందులో పాటది కీలక పాత్ర. నిజాం నిరంకుశంపై నినదించినా, దొరల దురాగతాలపై ఎలుగెత్తినా, అడవుల్లో అన్నగా మారి అభాగ్యులకు అండగా నిలిచినా, స్వరాష్ట్ర సాధనలో సకల జనుల గళమై కదంతొక్కినా.. కుల, మత, వర్గ బేధాలకు అతీతంగా అందరినీ ఏకం చేయడంలో పాట దారి చూపింది. పోరుబాటకు ఊతమైంది. ఆనందాచారి రాసిన ‘ఉద్యమబాటలో నా పాట’ పుస్తకంలోనూ అలాంటి పాటలకు అగ్ర తాంబూలం దక్కింది.
దొరలు, దోపిడీదారుల దౌర్జన్యాలను ఎదిరించడంలో పేదలకు అండగా నిలిచిన ఎర్రజెండా గొప్ప తనాన్ని ‘మా ఊపిరి జెండా’, ‘ఓ అరుణ పతాకమా..!’, ‘ఎర్రజెండా’, ‘నీవే నీవే’, ‘తోడై నన్నంటి ఉండే’ పాటలు చెప్తాయి. వాటిలోని ఓ ఆణిముత్యం.. ‘అన్యాయం బుస కొట్టే చోట/ దారిద్ర్యం తెగ బలిసిన చోట/ అసమానతలు పెరిగిన చోట/ తిరుగుబాటులో పూచిన బావుట’. అరుణ పతాకానికి ఇది చక్కటి నివాళి. బతకడానికి గాలి ఎంత ముఖ్యమో రక్తమూ అంతే ముఖ్యం.
మనుషులందరికీ ఇవి ఒక్కటే. మరి ఇంకెందుకు అంతరాలు? ఇదే విషయాన్ని నరనరాన జీర్ణించుకున్న పోరాటయోధుల గురించి ‘అమరులూ!’ పాట చెప్తుంది. ‘బతుకు శ్వాసకు గాలి ఒకటే, శక్తినిచ్చే రక్తమొకటే/ కులమతాల చిచ్చులెందుకు? మనుషులంతా ఒక్కటేనని/ ధనిక పేదల మధ్య గోడల కూలగొట్టే తెగువ చూపి/ సమసమాజపు స్వప్న గీతికలాలపించిన అమరులూ’ అంటూ త్యాగశీలులను శ్లాఘిస్తుంది.
మేడే పుట్టుకను గుర్తుచేస్తూ రాసిన పాటలో ‘కష్టజీవి కన్నీళ్లను తుడిచి ధైర్యమిచ్చింది/ కడు బాధల కారణాలు విడమరచి చెప్పింది/ పిడికిళ్లు బిగపడితే తెగిపడును సంకెళ్లని/ పోరులోనే శ్రమఫలాలు చేరుననీ తెలిపింది’ అంటూ కార్మిక శక్తికి కర్తవ్యాన్ని బోధిస్తుంది. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసిన వామపక్ష వీరులను, యోధులకూ తన పాటలతో రచయిత ఘన నివాళి అర్పించారు. లెనిన్, సుందరయ్య, ఏచూరీ, బుద్ధదేవ్ల సేవలను స్మరించారు.
అమ్మ గురించి చెప్తూ ‘నీ రక్తం పంచుకు పుట్టాం/ నీ శక్తిని నింపుకు పెరిగాం/ మా బలమును పెంచిన నిన్ను/ అబలంటూ వంచించారా!’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. మరో పాటలో అందం గురించి చెప్తూ ‘ప్రశ్న తలెత్తితే భవితందం/ పోరాడి నిలిచేటి బతుకుందం/ పరుల మేలుకోరు మనసందం/అక్షరాల బలము మనకందం’ అంటూ అక్కడా చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తారు. పిల్లల గురించి పాటలోనూ ‘కలసి మెలసి మనుషులుంటే/ బలము నిండును లోకమూ’ అంటూ యథాప్రకారం సమసమాజాన్ని కాంక్షిస్తారు.
ఈ పుస్తకంలోని పాటల్లో అధికభాగం శ్రామికవర్గాల విలువను చెప్తాయి. వాళ్ల ఆవేదనను కళ్లకు కడతాయి. పేదలు, బడుగు బలహీన వర్గాలు, అభాగ్యుల తరఫున గళమెత్తుతాయి. చెమట చుక్కల గొప్పతనాన్ని స్వర, లయబద్ధంగా వివరిస్తాయి. అలాగే, ప్రకృతి, తల్లులు, పిల్లలు, విద్యార్థుల తరఫునా ఈ పుస్తకంలో పాటలు క(వి)నిపిస్తాయి.
అయితే, అన్నింటిలోనూ అంతర్లీన లక్షణం చైతన్యమే. సమైక్య జీవనాన్ని, సమసమాజాన్ని కోరే ఈ పాటలు అచ్చంగా శ్రమజీవుల బతుకు పాటలు. ఇవి సాధారణ జనం పాడుకోవడానికే కాదు.. సినిమాల్లోనూ అమరేలా పల్లవి, చరణాలు, ప్రాసల లక్షణాలు పొందుర్చుకుని, అర్థవంతంగా ఉన్నాయి.
