వ్యక్తిని మింగి ఉమ్మేసిన తిమింగలం.. వ్యక్తి సేఫ్

వ్యక్తిని మింగి ఉమ్మేసిన తిమింగలం.. వ్యక్తి సేఫ్

అమెరికాలోని ప్రావిన్స్ టౌన్‌లో ఓ విచిత్రం జరిగింది. ఓ వ్యక్తిని అమాంతం మింగేసిన తిమింగలం.. అర నిమిషం తర్వాత బయటకి ఉమ్మేసింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం కేప్ కాడ్ తీరంలో చోటుచేసుకుంది. వెల్‌ఫ్లీట్‌కు చెందిన 56 ఏళ్ల మైఖేల్ ప్యాకర్డ్ లోబస్టర్ డైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన శుక్రవారం సముద్రంలో 45 అడుగల లోతులో డైవింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఆయనపై ఓ భారీ తిమింగలం దాడి చేసింది. కన్ను మూసి తెరిచే లోపు మైఖేల్.. ఓ చీకటి గదిలో ఉన్నట్లుగా భావించాడు. కాసేపటి తర్వాత అతనికి అర్థమైంది.. తనను తిమింగలం మింగింది అని. భయపడకుండా మైఖేల్ తిమింగలం కడుపులో అలాగే ఉన్నాడు. అప్పటికే ఆయన ఆక్సిజన్ మిషన్ పెట్టుకొని ఉండటం వల్ల శ్వాసకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. 

మైఖేల్ తలను అటూ.. ఇటూ.. కదిలించడంతో తిమింగలం మైఖేల్‌ను అర నిమిషం తర్వాత బయటకు ఉమ్మేసింది. గమనించిన తోటి డైవర్లు వెంటనే మైఖేల్‌ను కేబ్ కాడ్ హాస్పిటల్‌కు తరలించారు. తిమింగలం కడుపులో ఉన్నప్పుడు తాను చనిపోతానని భావించానని మైఖేల్ చెప్పాడు. ఆ సమయంలో తన భార్య, పిల్లలు గుర్తుకువచ్చారని ఆయన అన్నాడు. ప్రస్తుతం మైఖేల్ కాలు విరిగిందని.. మరో కాలుకు గాయాలయ్యాయని ఆయన సోదరి తెలిపింది. ఇటువంటి ఘటనలు జరగడం చాలా అరుదు అని ప్రొవిన్స్‌టౌన్‌లోని సెంటర్ ఫర్ కోస్టల్ స్టడీస్‌లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న చార్లెస్ అన్నాడు.  తిమింగలం చేపలను ఆహారంగా తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని ఆయన భావిస్తున్నట్లు చెప్పారు.