హాంగ్ కాంగ్ లో ఫస్ట్‌ నాడు రోడ్లపై నిరసన

హాంగ్ కాంగ్ లో ఫస్ట్‌ నాడు రోడ్లపై నిరసన

హాంకాంగ్: హాంకాంగ్​లో టెన్షన్లు కొనసాగుతున్నాయి. న్యూ ఇయర్ రోజునా ఆందోళనలు కొనసాగాయి. బుధవారం హాంకాంగ్ ఫైనాన్షియల్ హబ్ అయిన వాన్ చాయ్ జిల్లాలో ప్రో-డెమోక్రసీ నిరసనకారులు గొడుగులు పట్టుకుని వేలాది సంఖ్యలో రోడ్లమీదికి వచ్చి తమ నిరసన తెలిపారు. యువకులు, మహిళలు, తమ ముఖాలకు సర్జికల్ మాస్కులు వేసుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. 2019 నుంచి తాము చేస్తున్న డిమాండ్లను 2020 లోనూ కొనసాగించాల్సిరావడం విచారకరమని ర్యాలీ ప్రారంభంలో జిమ్మీ షామ్ అనే నిరసనకారుడు చెప్పారు. ర్యాలీ ప్రారంభమైన కొద్దిసేపటికే పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో టెన్షన్లు చోటుచేసుకున్నాయి. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు టెంపరరీ బారికేడ్లకు నిప్పంటించారు. షాపులు, మాల్స్ మూతపడ్డాయి. నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్, పెప్పర్ స్ప్రేలు ప్రయోగించారు. ర్యాలీకి సివిల్ హ్యూమన్ రైట్స్ ఫ్రంట్ పర్మిషన్ ఉన్నప్పటికీ గొడవలు ప్రారంభం కావటంతో వెంటనే ముగించాలని పోలీసులు ఆదేశించారు.

చైనా ఆధిపత్యం తొలగేవరకు పోరాడుతం

నేరస్థుల అప్పగింత పేరిట ప్రజల హక్కులను కాలరాసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై భయాందోళన వ్యక్తం చేస్తున్న హాంకాంగ్ వాసులు.. కిందటేడాది జూన్ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. హాంకాంగ్ పై చైనా ఆధిపత్యం పూర్తిగా తొలగిపోవాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ప్రారంభమైన నిరసనలు తిరుగుబాటుగా మారాయి. తమ ప్రాంతంపై చైనా ఆధిపత్యం తొలగిపోయేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని వారు అంటున్నారు. నిరసన కార్యక్రమాల్లో ఇప్పటివరకు అరెస్టయిన 6500 మందిని విడుదల చేయాలని, స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని, పోలీసులు ఓవర్ యాక్షన్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.