ఆరు రోజులుగా అరిగోస..హైదరాబాద్ లో ఎటు చూసినా వరద

ఆరు రోజులుగా అరిగోస..హైదరాబాద్ లో ఎటు చూసినా వరద
  • కంపుకొడుతున్న కాలనీలు.. ఆగమైన బతుకులు
  • అందని రిలీఫ్‌ కిట్లు.. సహాయ చర్యలు నామమాత్రం
  • హయత్‌నగర్​లో టీఆర్​ఎస్​ కార్పొరేటర్​ను గల్లా పట్టి నిలదీసిన మహిళ
  • ఇప్పటిదాకా 44 మంది మృత్యువాత

ఆరురోజులుగా హైదరాబాద్​లోని వందలాది కాలనీలు, బస్తీల్లో జనం నరకం అనుభవిస్తున్నారు. తగ్గినట్టే తగ్గి మళ్లీ వాన దంచికొట్టడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ప్రవాహానికి చిన్న చిన్న ఇండ్లు, కార్లు, ట్రాలీలు, ఆటోలు, టూవీలర్లు, తోపుడుబండ్లు  ఎక్కడికక్కడ  కొట్టుకుపోయాయి. సరూర్​నగర్, ఓల్డ్​ సిటీ​ వంటి ఏరియాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. మంగళవారం 24 గంటల పాటు కురిసిన కుండపోత వానకు అతలాకుతలమైన సిటీ.. శనివారం సాయంత్రం పడ్డ భారీ వర్షానికి మరింత ఆగమైంది. చెరువులు, నాలాలు పొంగి పొర్లుతుండటం, మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలన్నీ  నీట మునిగాయి. బాధితులకు సర్కార్​ నుంచి కనీసం రిలీఫ్‌ కిట్లు కూడా అందడం లేదు. 

హైదరాబాద్‌, వెలుగువానలు, వరదల ధాటికి గ్రేటర్‌ హైదరాబాద్​లోని అన్ని ప్రాంతాల ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఓల్డ్‌ సిటీలోని కాలనీలు ఇప్పటికే వాననీటితో  మునుగగా.. గుర్రం చెరువుకు గండిపడటంతో బాబానగర్‌ బస్తీ మొత్తం నీళ్లు నిలిచిపోయాయి. టోలిచౌకీలోని నదీంకాలనీ మళ్లీ మునిగిపోయింది. నీరజ్‌ కాలనీ, విరహత్‌నగర్‌, బాల్‌రెడ్డినగర్‌, ఫిలింనగర్‌ బస్తీల్లో బురద పెద్ద ఎత్తున పేరుకుపోయింది. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుర్హాన్‌చెరువు నిండటంతో దాని బ్యాక్‌ వాటర్‌లో ఉస్మాన్‌నగర్‌, షాహీన్‌నగర్‌ ప్రాంతాలు నీట మునిగాయి. ఓల్డ్‌ సిటీలోని ఆషామాబాద్‌, జీఎం కాలనీ, అల్జుబల్‌ కాలనీల్లోనూ పెద్ద ఎత్తున నీళ్లు నిలిచాయి. ఆయా ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ సిబ్బంది బోట్లు, జేసీబీలతో సహాయ చర్యలు చేపట్టారు. హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తడంతో ముసారాంబాగ్‌ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాని సమీపంలోని కాలనీల ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు.

తిండి కూడా పెట్టరా..?

వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ప్రభుత్వం ఆహార ప్యాకెట్లు, ఇతర వస్తువులు ఇస్తున్నామని చెప్తున్నా అవి చాలా మందికి అందడం లేదు. రోజుల తరబడి వరదలో చిక్కుకుని ఉంటున్నా కనీసం తమను పట్టించుకునే వారే లేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం హయత్‌నగర్‌ కార్పొరేటర్‌ సామ తిరుమల్‌రెడ్డిపై జనం తిరుగబడ్డారు. తాగడానికి నీళ్లు లేవని, తిండి కూడా పెట్టడం లేదని, తమను పట్టించుకునే వారే కరువయ్యారని బాధితులు వాపోతున్నారు. భారీ వర్షాలు, వరదలతో తమ ఇండ్లు మునిగిపోయాయని, కట్టుబట్టలతో మిగిలామని పలువురు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వస్తువులన్నీ బురదలో కూరుకుపోయాయని, బియ్యం తడిసి అక్కరకు రాకుండా పోయాయని అంటున్నారు. సర్వస్వం కోల్పోయిన తమకు ధైర్యం చెప్పడానికి కూడా ఎవరూ రావడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఇట్లాంటప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆదుకుంటుందని అధికారులు, లీడర్లను వరద బాధితులు నిలదీస్తున్నారు. ఏవో కొందరికీ అన్నం ప్యాకెట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, తాము చచ్చాక వచ్చి ఏం చేస్తారంటూ కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిలీఫ్​ కిట్స్​ అందుతలె

భారీ వర్షాలు, వరదలతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో బురద పేరుకుపోయింది. వరదల ఉధృతికి అనేక ఇండ్లు కూలిపోయాయి. ఆరు రోజులుగా నీళ్లు, బురదలోనే ప్రజలు కాలం వెళ్లదీయాల్సి వస్తున్నది. రిలీఫ్‌ క్యాంపుల్లో సదుపాయాల్లేక వాటిలో ఉండటానికి జనం తిప్పలు పడుతున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న అనేక మందికి సీఎం రిలీఫ్‌ కిట్లు కూడా అందడం లేదు. జబ్బులు ప్రబలకుండా కట్టడి చేసేందుకు మొబైల్‌ హెల్త్‌ టీంలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా వాటి సేవలూ అంతంతమాత్రంగానే అందుతున్నాయి.

500కు పైగా కాలనీల్లో కరెంట్ కట్

వరద తీవ్రత ఎక్కువగా ఉన్న 222 కాలనీల్లో మంగళవారం నుంచి కరెంట్‌ లేదు. వీటితోపాటు సెల్లార్లు మునిగిన అపార్ట్‌మెంట్లకు కరెంట్‌ కట్‌  చేశారు. ఇలా కరెంట్‌ కట్‌ చేసిన కాలనీలు ఇంకో  500కు పైగా ఉంటాయని అంచనా. తాగేందుకు, ఇతర అవసరాలకు నీళ్లు లేక అపార్ట్‌మెంట్‌ వాసులు తిప్పలు పడుతున్నారు. సాధారణంగా బస్తీల్లోనే కనిపించే వరద ముంపు ఈసారి వరుస వానలతో నగరంలోని అన్నీ ప్రాంతాలకు విస్తరించింది. ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లోని వరద నీటిని తొలగిస్తామని చెప్తున్నా అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లే సొంతంగా ఆయిల్‌ ఇంజన్లను కిరాయికి తెచ్చుకొని.. సెల్లార్లలో నిలిచిన నీటిని తొలగిస్తున్నాయి. మొదటి రెండు రోజులు సహాయక చర్యల పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వంలోని ముఖ్యులు, నాయకులు ఆదివారం వాటి సంగతే మరిచారు.

మూసీ ప్రాంతాలు మళ్లీ ఖాళీ

మంగళవారం పడ్డ వానకు ధ్వంసమైన మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీలను శనివారం రాత్రి కురిసిన వాన మరింత దెబ్బతీసింది. గురువారం, శుక్రవారం కాస్త వరద ఉధృతి తగ్గడంతో స్థానికులు ఇండ్లల్లోకి వచ్చి క్లీన్​ చేసుకుంటుండగా ఇంతలో   వానపడటంతో మళ్లీ ఆ ప్రాంతాలను ఖాళీ చేయాల్సి వచ్చింది. మూసానగర్, వినాయక్​దిది, రసూల్ పురా, వాహెత్​నగర్​, శంకర్​నగర్​, పద్మానగర్​, న్యూ పద్మానగర్​, ఓల్డ్​ మలక్​ పేట్, చాందిని బ్రిడ్జి, మహారాజ్​ హోటల్​ తదితర ప్రాంతాను స్థానికులు ఖాళీ చేశారు.

ప్రగతి భవన్దాటని సీఎం

భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్​ జనం అవస్థలు పడుతున్నా.. అండగా ఉంటామని చెప్పేందుకు సీఎం కేసీఆర్​ ప్రగతిభవన్‌ గేటు దాటి అడుగు బయట పెట్టడం లేదు. విపత్కర పరిస్థితుల్లో సీఎం కాలనీల్లోకి వెళ్లి భరోసా ఇస్తే బాధితులకు ధైర్యంగా ఉంటుందని, అధికార యంత్రాంగం వేగంగా పనులు చేస్తుందని జనం అంటు న్నారు. కానీ సీఎం వైపు నుంచి ఆ ప్రయత్న మేదీ కనిపించడం లేదు. 3, 4 రోజులు బస్తీల్లో తిరిగిన మున్సిపల్‌ మంత్రి కేటీఆర్​.. ఆదివా రం హాలిడే మూడ్‌లోకి వెళ్లిపోయారు. జీహెచ్‌ ఎంసీ ఆఫీసర్లకు ఏవో సూచనలు చేయడం తప్ప వరద సహాయ చర్యలపై రివ్యూ చేయడమో, బాధితుల వద్దకు వెళ్లి భరోసా ఇవ్వడమో చేయలేదు. మంత్రులు సబిత, మహమూద్‌ అలీతో పాటు కొందరు ఎమ్మెల్యే లు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

ఆరేండ్ల పాలనలో చేసింది ఇదేనా?

కాలనీలు నీట మునిగి ఇన్ని తిప్పలు పడుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదు. వరద బాధితులను ఆదుకోవడంలో ఫెయిలైంది. సరూర్‌ నగర్‌ కట్టపై నాలాలు కబ్జా కావడంతో మాకు ఈ పరిస్థితి దాపురించింది. ఆరేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసింది ఇదేనా?  సీఎం కేసీఆర్‌ చేస్తానన్న డల్లాస్‌ అంటే ఇదేనా..?  మంత్రి కేటీఆర్‌.. ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కాదు.. జనం బాధలు పట్టించుకోవాలి.

– ప్రవీణ్‌, సరూర్‌నగర్‌ వాసి