- రూ. వందల కోట్లు చేతులు మారుతున్నట్లు అంచనా
- అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్‌పైనే పందెం
- కాంగ్రెస్ గెలుస్తదంటూ ఎక్కువగా బెట్టింగ్ వేస్తున్న పందెంరాయుళ్లు
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. పోలింగ్‌కు ఇంకా మూడు రోజులు, ఫలితాల వెల్లడికి వారం టైం ఉన్నప్పటికీ.. మారుతున్న సమీకరణలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు గెలుపోటములపై పందేలు నడుస్తున్నాయి. గెలుపు ఎవరిదనే అంశంతోపాటు మెజార్టీ ఎంత? అనేదాని చుట్టూ కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, పొరుగున ఉన్న ఏపీ రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు కూడా బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం.
ఈ బై ఎలక్షన్ సందర్భంగా చేతులు మారే అక్రమ నగదు విలువ రూ. వందల కోట్లలో ఉంటుందని భావిస్తున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తయిన నాటి నుంచే పందేలు కాసినట్లు తెలుస్తుండగా, పోలింగ్ తేదీ , రిజల్ట్ నాటికి ఈ మొత్తం రూ. వెయ్యి కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలిలాంటి ప్రాంతాలతోపాటు ఏపీలోని విజయవాడ, గుంటూరులాంటి నగరాల నుంచి ఈ బెట్టింగ్ నెట్‌వర్క్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. బెట్టింగ్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ప్రైవేట్ సర్వేలు చేయిస్తూ, అంచనాలను బట్టి పందెం రేట్లను మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ రెండు పార్టీల మధ్యే వార్..
ప్రధానంగా ఈ ఉప ఎన్నిక పోరు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్యే ఉన్నది. బీజేపీ కూడా బరిలో ఉన్నప్పటికీ ప్రధాన బెట్టింగ్ మొత్తం మాత్రం ఈ రెండు పార్టీల చుట్టే తిరుగుతున్నట్టు తెలుస్తున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ఈ స్థానాన్ని గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తుండగా, గతంలో ఈ స్థానాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ తిరిగి గెలవడం ద్వారా ఉనికి చాటుకోవాలని చూస్తున్నది. దీంతో పందెంరాయుళ్లు కూడా ఈ రెండు పార్టీల అభ్యర్థులపైనే దృష్టి సారించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మధ్య హోరాహోరీ పోరు ఉండబోతున్నదని సర్వేలు చెప్తుండడంతో పందేల రేట్లు కూడా క్షణక్షణం మారుతున్నాయి.
కాంగ్రెస్ వైపే మొగ్గు..
ప్రస్తుత అంచనాలు, బెట్టింగ్ ట్రెండ్‌లను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అభిప్రాయం పందెంరాయుళ్లలో బలంగా ఉన్నట్లు తెలుస్తున్నది. బెట్టింగ్ రేట్లను పరిశీలిస్తే, కాంగ్రెస్ అభ్యర్థిపై పందెం కాసిన వారికి తక్కువ లాభం(ఉదాహరణకు రూ. 10కి రూ. 20 నుంచి -30 ) చెబుతుండగా , బీఆర్ఎస్ అభ్యర్థిపై పందెం కాసిన వారికి ఎక్కువ రిటర్న్స్ (ఉదాహరణకు రూ. 10కి రూ. 40 నుంచి -60 ) ఇచ్చేలా బెట్టింగ్నిర్వహిస్తున్నారు.
దీనిని బట్టి కాంగ్రెస్ విజయంపై ఎక్కువ మంది పందెం కాస్తున్నారని, దానితో పోలిస్తే బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు కాస్త తక్కువగా అంచనా వేస్తున్నారని తెలుస్తున్నది. బీఆర్ఎస్ గెలిస్తే వచ్చే భారీ లాభాల కోసం కొంతమంది ‘రిస్క్’ తీసుకునేందుకు వెనుకాడడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న సానుకూలత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం తదితర అంశాలు కాంగ్రెస్ వైపు పందెం మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
మెజార్టీ పైనా ప్రత్యేక బెట్టింగ్స్
పోలింగ్ రోజు దగ్గర పడుతుండడంతో బెట్టింగ్ వ్యవహారం జోరందుకున్నది. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని కొన్ని ప్రముఖ క్లబ్‌లు, ఫామ్‌హౌస్‌లు ఇందుకు వేదికలుగా మారినట్లు తెలుస్తున్నది. రిజల్ట్ రోజు వరకు ఈ బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతుందని, ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత మరింత బెట్టింగ్స్ పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కేవలం గెలుపోటములే కాకుండా, గెలిచే అభ్యర్థి మెజార్టీ ఎంత ఉంటుంది? అనే అంశంపై కూడా భారీగా పందేలు కాస్తున్నారు. ఉదాహరణకు, ‘గెలిచే అభ్యర్థి 5 వేల ఓట్ల లోపు మెజార్టీతో గెలుస్తారా? లేదంటే 5 వేల పైబడి మెజార్టీతో గెలుస్తారా? అనే దానిపై 1:2 నిష్పత్తిలో బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం.
10 వేలపైనే అయితే ఇంకో నిష్పత్తి, 5 వేల లోపు అయితే ఇంకో రేటింగ్‌లో బెట్టింగ్స్ కాస్తున్నారు. ప్రతి డివిజన్, ప్రతి ఓటర్ల గ్రూప్ బలాబలాలను విశ్లేషించుకుంటూ, నిపుణులను సంప్రదిస్తూ బెట్టింగ్పెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలోని చివరి ఘట్టాలు, అభ్యర్థుల ప్రసంగాలు, ఓటర్ల మూడ్‌లాంటి ప్రతి అంశం బెట్టింగ్ రేట్లను ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
