కాంగ్రెస్ వైఖరితో వందలాదిమంది విద్యార్థులు బలి: బీజేపీ చీఫ్ నడ్డా

 కాంగ్రెస్ వైఖరితో వందలాదిమంది విద్యార్థులు బలి: బీజేపీ చీఫ్ నడ్డా

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ కారణంగానే 1969 ఉద్యమంలో, ఆ తర్వాత జరిగిన మలిదశ ఉద్యమంలో తెలంగాణ యువత, విద్యార్థులు ఎందరో చనిపోయారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. 1969 ఉద్యమంలో 169 మంది విద్యార్థులను కాల్చి చంపారన్నారు. మలి దశ ఉద్యమంలో కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడంలో ఆలస్యం చేసినందువల్లే 1500 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని నడ్డా విమర్శించారు. ‘‘1969 తెలంగాణ ఉద్యమ సమితి”ఆధ్వర్యంలో ఆదివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఆనాటి  ఉద్యమకారుల ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ అమ రుల ఫోటోలు, వారి కుటుంబాల పరిస్థితులు, ఆయా పత్రికల్లో వచ్చిన కథానాలను ప్రదర్శించిన ఈ ఎగ్జిబిషన్ ను నడ్డా సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కారణంగా తెలంగాణ ఉద్యమకారులు ఎందరు చనిపోయారనే వివరాలను బయటపెట్టేందుకే ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించానని చెప్పారు. భూ కబ్జాలు, అనేక అక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్.. బీఆర్ఎస్ ఒక్కటేనని, బీజేపీకి చాన్స్​ ఇవ్వాలని కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్ ​నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం నడ్డా మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, ఆయనకు కాళేశ్వరం ఏటీఎంలాగా మారిందని నడ్డా అన్నారు.