లండన్: క్వీన్ ఎలిజబెత్ 2 చివరి చూపు కోసం వేలాది మంది బారులుతీరుతున్నారు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ బయట సోమవారం నుంచే క్యూ కట్టారు. శ్రీలంక సంతతికి చెందిన 56 ఏండ్ల వనెస్స నాథకుమారన్.. క్యూలో అందరికన్నా ముందు ఉన్నాడు. ‘‘నేను ఇందులో భాగం కావాలని అనుకుంటున్నాను. బ్రిటన్ రాజకుటుంబాన్ని మా కుటుంబం ఆరాధిస్తుంది’’ అని ఆయన చెప్పాడు. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్‌లో ఉన్న క్వీన్ పార్థివదేహాన్ని మంగళవారం సాయంత్రం లండన్‌కు రాయల్ ఎయిర్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) విమానంలో తరలించారు. క్వీన్ పార్థివ దేహం వెంట ప్రిన్సెస్ అన్నే వచ్చారు. లండన్‌లో కింగ్ చార్లెస్, క్వీన్ కామిల్లా రిసీవ్ చేసుకున్నారు.
ఇయ్యాల మధ్యాహ్నం ఊరేగింపు
ఇక బుధవారం మధ్యాహ్నం క్వీన్ పార్థివ దేహాన్ని ఊరేగింపుగా బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌కు తరలిస్తారు. క్వీన్స్ గార్డెన్స్, ది మాల్, హార్స్ గార్డ్స్, హార్స్ గార్డ్స్ ఆర్క్, వైట్ హాల్, పార్లమెంట్ స్ట్రీట్, పార్లమెంట్ స్క్వేర్, న్యూ ప్యాలెస్ యార్డ్ తదితర ప్రాంతాల మీదుగా ఊరేగింపు సాగుతుంది. లండన్‌లో ఈ రాజరిక ఊరేగింపు కోసం పలు రిహార్సల్స్ చేశారు. వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో ‘కెటాఫ్లాక్’పై క్వీన్ శవపేటికను ఉంచుతారు. బుధవారం సాయంత్రం 5 గంటల (అక్కడి టైం ప్రకారం) నుంచి వచ్చే సోమవారం ఉదయం 6.30 దాకా ప్రజల సందర్శనార్థం అనుమతిస్తారు. 19న అంత్యక్రియలు జరుగుతాయి.
క్యూ కొన్ని గంటలపాటు ఉండొచ్చు..
క్వీన్ చివరి చూపు కోసం వచ్చే వాళ్లు కొన్ని గంటలపాటు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉండొచ్చని బ్రిటన్ ప్రభుత్వ డిజిటల్, కల్చర్, మీడియా, స్పోర్ట్ డిపార్ట్‌మెంట్ (డీసీఎంఎస్) చెప్పింది.
