
- శ్రీశైలానికి ఇప్పటిదాకా 1,350 టీఎంసీలు.. సాగర్‌కు 918 టీఎంసీల వరద
- ఎల్లంపల్లికి 446 టీఎంసీలు.. శ్రీరాంసాగర్‌కు 363.74 టీఎంసీలు
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఇటు కృష్ణాతో పాటు అటు గోదావరి నదికి వందలాది టీఎంసీల వరద వచ్చింది. కృష్ణా ప్రాజెక్టులకు వర్షాకాలం ప్రారంభం నుంచే వరద పోటెత్తగా.. గోదావరి ప్రాజెక్టులకు మాత్రం ఆగస్టు ప్రారంభం నుంచి వరద రాక ప్రారంభమైంది. గోదావరి బేసిన్లో వరద ప్రవాహం ఆలస్యమైనా.. కొద్దిరోజుల్లోనే వందల టీఎంసీల ఫ్లడ్ వచ్చింది. కృష్ణాలోని ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్కూ భారీగా వరద వచ్చి చేరింది. ఇప్పటికీ ఆయా ప్రాజెక్టులకు వరద నిలకడగా కొనసాగుతున్నది.
శ్రీశైలం ప్రాజెక్టుకు జూన్ 1 నుంచి ఇప్పటివరకు 1,350 టీఎంసీల వరద రాగా.. 166.57 టీఎంసీల వినియోగం జరిగింది. ప్రాజెక్ట్ స్పిల్ వే ద్వారా 1,020 టీఎంసీలు విడుదల చేయగా.. స్పిల్‌వే, పవర్‌హౌస్, ఇతర మార్గాల ద్వారా ఔట్‌ఫ్లో 1,188 టీఎంసీలుగా ఉన్నది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 918.70 టీఎంసీల ఫ్లడ్ వచ్చింది. అందులో 200.32 టీఎంసీల వినియోగం జరిగినట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సాగర్ గేట్ల ద్వారా 544 టీఎంసీలను విడుదల చేయగా.. మొత్తంగా 745 టీఎంసీలు దిగువకు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టుకు 916 టీఎంసీల వరద జలాలు వచ్చాయి.
గోదావరికి లేట్ అయినా..
గోదావరి ప్రాజెక్ట్‌కు వరద ఆలస్యమైనా.. ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఎప్పటిలాగానే గోదావరికి ప్రాణహిత నది నీళ్లే ప్రాణం పోశాయి. ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు ఆగస్టు రెండో వారం నుంచి వరదలు మొదలయ్యాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇప్పటివరకు 363.74 టీఎంసీల వరదరాగా.. 14 టీఎంసీల వినియోగం జరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 446 టీఎంసీల ఫ్లడ్ వచ్చింది. అందులో ఇప్పటివరకు 5 టీఎంసీలను వినియోగించుకున్నారు.
కడెం ప్రాజెక్టుకు 36 టీఎంసీలు, సింగూరుకు 80 టీఎంసీలు, నిజాంసాగర్‌కు 128 టీఎంసీల చొప్పున వరద జలాలు వచ్చాయి. అయితే, మిడ్‌మానేరు డ్యామ్‌కు మాత్రం స్వల్ప ప్రవాహాలే నమోదయ్యాయి. ఎల్లంలపల్లి నుంచి పంపింగ్ ద్వారా 6.5 టీఎంసీలు, ఎగువ నుంచి ఇన్ ఫ్లోస్ కలిపి 47.73 టీఎంసీల వరద రికార్డయింది. కాగా, సీతమ్మసాగర్ బ్యారేజ్ వద్ద ఇప్పటి వరకు ఈ సీజన్లో అత్యధికంగా 2374.97 టీఎంసీల వరద వచ్చినట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.