తుది దశకు చేరుకున్న కాంగ్రెస్, వైఎస్ఆర్​టీపీ చర్చలు

తుది దశకు చేరుకున్న కాంగ్రెస్, వైఎస్ఆర్​టీపీ చర్చలు
  • ఢిల్లీకి వెళ్లిన షర్మిల.. కాంగ్రెస్​కు పలు షరతులు
  • 20 నుంచి 30 సీట్లు ఇస్తేనే విలీనం 
  • తనకు పాలేరు లేదా సికింద్రాబాద్ టికెట్​పై పట్టు
  • డీకే శివకుమార్ ద్వారా విలీనంపై చర్చలు!

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​లో షర్మిల పార్టీ వైఎస్​ఆర్​టీపీ విలీనం కొత్త టర్న్​ తీసుకుంది. పార్టీలో చేరడానికి బదులు పొత్తు పెట్టుకుందామంటూ కాంగ్రెస్ పెద్దలతో ఆమె చెప్పినట్టు   వినిపిస్తున్నది. పార్టీని విలీనం చేయాలంటే తాము చెప్పిన డిమాండ్లన్నింటికీ ఓకే చెప్పాలని షర్మిల తేల్చి చెప్పినట్టు సమాచారం. లేదంటే పొత్తుతోనే ముందుకెళ్దామంటూ స్పష్టం చేసినట్టుగా తెలుస్తున్నది. దీనికి సంబంధించి నాలుగైదు రోజుల నుంచి ఆమె భర్త అనిల్ కుమార్ ఢిల్లీలోనే మకాం వేశారు. పార్టీని విలీనం చేయడంపై కాంగ్రెస్​ హైకమాండ్​లోని పెద్దలతో ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే గురువారం షర్మిల ఢిల్లీకి వెళ్లారు. హైకమాండ్ తో శుక్రవారం సమావేశమైనట్టు తెలిసింది. అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్​కు వచ్చేశారు. కాంగ్రెస్​లో పార్టీ విలీనం/పొత్తుకు సంబంధించి మరో మూడ్రోజుల్లో ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నట్టు సమాచారం.

డిమాండ్లు ఓకే అంటేనే..

పార్టీని విలీనం చేయాలంటే తాము చెప్పిన షతరతులకు ఓకే చెప్పాలని కాంగ్రెస్ పెద్దలకు షర్మిల తేల్చి చెప్పారని తెలిసింది. తమకు 20 నుంచి 30 దాకా సీట్లను ఇవ్వాలని కండిషన్ పెట్టినట్టుగా సమాచారం. తనకు పాలేరు సీటును ఇవ్వాలన్న డిమాండ్​నూ కాంగ్రెస్​ పార్టీ పెద్దల ముందు పెట్టినట్టు తెలిసింది. ఆ సీటు కాకపోతే సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ పరిధిలోని సెగ్మెంట్​లో సీటు ఇవ్వాలన్నట్టు సమాచారం. తమ డిమాండ్లను ఒప్పుకోకుంటే ఎన్నికల నాటికి పొత్తుతోనే సరిపెట్టుకునేలా తేల్చిచెప్పినట్టు తెలిసింది. వీటన్నింటిపై ఓ క్లారిటీ వస్తే మరో మూడ్రోజుల్లో షర్మిలనే స్వయంగా పార్టీకి సంబంధించిన ప్రకటన చేసే అవకాశాలున్నట్టు తెలిసింది.

బెంగళూరులోనే మకాం..

షర్మిల తన పార్టీని కాంగ్రెస్​లో కలిపేస్తున్నారంటూ 3 నెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్​తో ఆమె వరుసగా భేటీలు కావడం ఆ వార్తలకు బలం చేకూరింది. తొలిసారిగా మే 15న డీకే​తో బెంగళూరులో భేటీ అయ్యారు. పుట్టినరోజు విషెస్​ చెప్పేందుకే వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు. తర్వాత అదే నెల 29న మరోసారి ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పటి నుంచే పార్టీని కాంగ్రెస్​లో విలీనం చేయించేందుకు డీకే చొరవ తీసుకుంటున్నారన్న చర్చ నడిచింది. ఇప్పుడు ఆమె నెలన్నర నుంచి బెంగళూరులోనే ఉన్నారని తెలుస్తున్నది. డీకే రాయబారంలోనే ఆమె కాంగ్రెస్ లో విలీనంపై చర్చలు సాగించినట్టు తెలుస్తున్నది.

రెండు రాష్ట్రాల్లో చేయమంటున్నరు..

తెలంగాణ ఏర్పాటుతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. అక్కడ పార్టీ కార్యకలాపాలు కూడా అంతగా ఏమీ లేవు. ఈ క్రమంలోనే అక్కడ కూడా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు హైకమాండ్ యోచిస్తున్నది. వైఎస్​ఆర్​టీపీ విలీనం చర్చ మొదలైనప్పటి నుంచి.. ఏపీలో ఆమె సేవలను వినియోగించుకోవాలని పార్టీ భావిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. దీనిపై ఆమెతోనూ చర్చించినట్టు చెప్తున్నారు. ఆమె మాత్రం తెలంగాణలోనే ఉండేందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తున్నది. ఇక్కడ ఆమె సేవలు అవసరం లేదంటూ గతంలో పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైకమాండ్ మాత్రం తాజా చర్చల్లో రెండు రాష్ట్రాల్లోనూ సేవలందించాల్సిందిగా షర్మిలను కోరినట్టు తెలుస్తున్నది. అందుకు ఆమె ఒప్పుకోలేదని అంటున్నారు.

షర్మిలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా: ఎంపీ కోమటిరెడ్డి

షర్మిలను మనస్ఫూర్తిగా కాంగ్రెస్​లోకి ఆహ్వానిస్తున్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి  అన్నారు. శుక్రవారం శంషాబాద్ ఎయిర్​పోర్ట్​లో ఆయన్ను కాంగ్రెస్​లో షర్మిల పార్టీ విలీనంపై మీడియా ప్రశ్నించగా స్పందించారు. ‘‘షర్మిలను కాంగ్రెస్​లోకి ఆహ్వానిస్తున్న..- వైఎస్ కూతురిగా ఆమెకు కాంగ్రెస్​లో ఎప్పుడైనా ఆహ్వానం ఉంటుంది. షర్మిల వల్ల 4 ఓట్లు వచ్చినా, 400 ఓట్లు వచ్చినా పార్టీకి లాభమే కదా..- ఆమె చేరికపై పార్టీ హైకమాండ్ అడిగినప్పుడు ఈ విషయాన్నే చెప్త.- ఒకరికొకరు కలిసి బలపడాలి.. కాంగ్రెస్ ఇదే భావిస్తున్నది” అని అన్నారు. కాంగ్రెస్​లో వైఎస్​ఆర్​టీపీ విలీనం సంగతి షర్మిలని అడిగితే బాగుంటుందని చెప్పారు.