బిలియనీర్ల అడ్డా ముంబై

బిలియనీర్ల అడ్డా ముంబై
  • బీజింగ్​ను వెనక్కి నెట్టి 92 మందితో ఫస్ట్ ప్లేస్
  • ప్రపంచంలో మూడో సిటీ
  • హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్​–2024 లో వెల్లడి

న్యూఢిల్లీ : ఆసియాలో బిలియనీర్లకు అడ్డాగా ముంబై నిలిచింది. చైనాలోని బీజింగ్​ను వెనక్కి నెట్టి, మొదటి స్థానం సంపాదించింది. తొలిసారి ఆసియా ‘బిలియనీర్ క్యాపిటల్’గా అవతరించింది. ముంబైలో 92 మంది బిలియనీర్లు ఉండగా, బీజింగ్​లో 91 మంది ఉన్నారని ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-–2024’ లో వెల్లడైంది. పోయినేడాదితో పోలిస్తే ముంబైలో కొత్తగా 26మంది బిలియనీర్ల జాబితాలో చేరగా

బీజింగ్​లో 18 మంది ఆ జాబితాలో చోటు కోల్పోయారని రిపోర్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల జాబితాలో ముంబై మూడో ప్లేసులో ఉంది. 119 మందితో న్యూయార్క్ మొదటి స్థానం సంపాదించింది. 97 మందితో లండన్ సెకండ్ ప్లేస్, 92 మందితో ముంబై థర్డ్ ప్లేసులో ఉంది. కాగా, ఢిల్లీ తొలిసారి టాప్ టెన్ జాబితాలో చోటు దక్కించుకుంది. 57 మంది బిలియనీర్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 

వరల్డ్​లో చైనా నంబర్ వన్ కంట్రీ.. 

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,279 మంది బిలియనీర్లు ఉన్నారని హురున్ రిపోర్టు వెల్లడించింది. గతంతో పోలిస్తే బిలియనీర్ల సంఖ్య తగ్గినప్పటికీ, 814 మంది బిలియనీర్లతో చైనానే ప్రపంచంలో నంబర్ వన్​ దేశంగా నిలిచిందని తెలిపింది. 800 మంది బిలియనీర్లతో అమెరికా రెండో స్థానంలో, 271 మంది బిలియనీర్లతో ఇండియా మూడో స్థానంలో ఉందని వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రెజిల్ ఉన్నట్టు తెలిపింది. 

ప్రపంచ కుబేరుడు మస్క్..  

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ నిలిచారు. ఆయన సంపద 231 బిలియన్ అమెరికన్ డాలర్లు. రెండో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (185 బిలియన్ యూఎస్ డీ), మూడో స్థానంలో ఎల్ వీఎంహెచ్ కంపెనీ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్డ్ (175 బిలియన్ యూఎస్ డీ) ఉన్నారు. టాప్ టెన్ లో మన దేశం నుంచి ముఖేశ్ అంబానీ ఒక్కరే చోటు దక్కించుకున్నారు.

ఆయన 115 బిలియన్ అమెరికన్ డాలర్లతో పదో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో గౌతమ్ అదానీ(15), శివ్ నాడార్(34), సైరస్ పూనావాలా(55), దిలీప్ సంఘ్వీ (61), కుమార్ మంగళం బిర్లా (100), రాధాకిషన్ దామానీ (100) ఉన్నారు.