ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలం బోదులబండలో చెరుకు తోటలో జడలు వేస్తుండగా తెగిన విద్యుత్ వైరు తగిలి భార్యాభర్తలు మృతి చెందారు. చనిపోయిన వారు తెలగమళ్ల ఆనందరావు, తెలగమళ్ల పార్వతిగా గుర్తించారు. తమ తోటలోని చెరుకు నరికి దగ్గరలోని షుగర్ ఫ్యాక్టరీకి తరలించేందుకు నిర్ణయించారు. కూలీల కంటే ముందుగా వారు గురువారం పొలానికి చేరుకొని.. చెరుకు తోటలో జడలు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

