సంగారెడ్డి జిల్లా ఆమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి వడక్ పల్లి గ్రామ శివారులో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో నిజామాబాద్ కు చెందిన బానోతు రాజు (48) తాగిన మైకంలో భార్యను కొట్టి చంపాడు.
కుటుంబంతో కలిసి ఆరు నెలల కిందట బతుకుదెరువు కోసం అమీన్ పూర్ కు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు దంపతులిద్దరు. గత కొన్ని రోజులుగా దంపతులిద్దరికి గొడవలు జరుగుతున్నాయి. అక్టోబర్ 31న తాగొచ్చిన భర్త రాజు.. భార్య భానోత్ సరోజ (44) తో గొడవపడి ఆమె తలపై కట్టెతో కొట్టాడు. దీంతో తీవ్ర రక్త స్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయింది.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భానోత్ వినోద (18) భానోత్ విశాల్ (16) ఇద్దరు సంతానం. నిందితుడు రాజు భార్యను వేధించిన కేసులో గతంలో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అమీన్ పూర్ పోలీసులు.
