భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

వరంగల్‍/కాశీబుగ్గ, వెలుగు : భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో రోకలిబండతో భార్యను హత్య చేసి తర్వాత పురుగుల మందు తాగి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ ఘటన మంగళవారం వరంగల్‌‌‌‌ నగరంలో జరిగింది. వరంగల్‌‌‌‌లోని లేబర్‌‌‌‌ కాలనీకి చెందిన మంద చరణ్‌‌‌‌ (45) మేస్త్రీగా పని చేస్తుండగా, అతడి భార్య స్వప్న (40) నగరంలోని ఓ షాపింగ్‌‌‌‌ మాల్‌‌‌‌లో పనిచేస్తోంది.

 వీరికి గ్రీసీ, మెర్సీ, షాలోమ్‍ ముగ్గురు పిల్లలు. ఇందులో పెద్ద కూతురు గ్రీసీకి మానసిక ఎదుగుదల లేకపోగా అబ్బాయి మెర్సీకి కళ్లు కనిపించవు. చిన్న కూతురు షాలోమ్‌‌‌‌ గుండెకు రంధ్రం ఉండడంతో అనారోగ్యంతో బాధపడుతోంది. సోమవారం రాత్రి స్వప్న సోదరుడి ఇంట్లో ఓ ఫంక్షన్‌‌‌‌ ఉండగా ముగ్గురు పిల్లలను ముందే పంపించారు. రాత్రి తొమ్మిది గంటల టైంలో స్వప్న డ్యూటీ నుంచి ఇంటికి వచ్చింది.

 ఈ టైంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో చరణ్‍ రోకలి బండతో స్వప్నను కొట్టడంతో ఆమె చనిపోయింది. తర్వాత తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్వప్న సోదరుడి కుటుంబ సభ్యులు ఎంత సేపు ఫోన్‌‌‌‌ చేసినా తీయకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున చరణ్‌‌‌‌ ఇంటికి వచ్చి చూడగా ఇద్దరూ చనిపోయి కనిపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి వివరాలు సేకరించారు. 

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వరంగల్‍ ఏసీపీ నందిరాం నాయక్‌‌‌‌, మిల్స్‌‌‌‌ కాలనీ సీఐ మల్లయ్య చెప్పారు. తల్లిదండ్రులు చనిపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వారి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోవడంతో మిల్స్‌‌‌‌ కాలనీ ఎస్సైలు చందర్‍, శ్రీకాంత్‌‌‌‌ కొంత ఆర్థికసాయం అందజేశారు. అలాగే స్థానిక కార్పొరేటర్‌‌‌‌ వస్కుల బాబు, కాలనీవాసులు గడ్డమీది రాజేశ్‍, దగ్గరి బంధువులతో మాట్లాడి అంత్యక్రియలు పూర్తి చేశారు.