
- మహబూబ్నగర్ జిల్లా రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో ఘటన
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: భార్యపై అనుమానంతో గొడ్డలితో నరికి చంపి, ఆ తరువాత రైలు కింద పడి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ రూరల్ ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కలోనిపల్లి గ్రామానికి చెందిన నాగన్న కూతురు సరిత(28) కు పన్నెండేండ్ల కింద జానంపేటకు చెందిన రాజేశ్(35) తో పెండ్లి జరిగింది. అతను ఇల్లరికం వెళ్లగా, భార్యభర్తలు బొక్కలోనిపల్లి గ్రామంలో కూలీ పని చేస్తూ బతుకుతున్నారు.
కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాజేశ్ గొడ్డలితో సరితను నరికి చంపాడు. అనంతరం సమీపంలోని రైల్వే ట్రాక్ పై పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సరిత తండ్రి నాగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వీరికి ఎనిమిది, పదేండ్ల వయసు ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నారు.