కడుపుతో ఉన్న భార్యను కెనడాలో వదిలేసిన భర్త

కడుపుతో ఉన్న భార్యను కెనడాలో వదిలేసిన భర్త

హైదరాబాదుకు చెందిన రెండు నెలల గర్భవతి అయిన దీప్తిరెడ్డి కెనడాలో నానా అవస్థలు పడుతోంది. ఆమె భర్త చంద్రశేఖర్ రెడ్డి ఆమెను కెనడాలోని మాన్‌ట్రీల్ లో  వదిలేసి హైదరాబాదుకు వచ్చాడు. మెక్ గ్రిల్ యూనివర్శిటీలో కెమిస్ట్రీ విభాగంలో పోస్ట్ డాక్ గా ఆయన పని చేస్తున్నాడు. ఆగస్టు 9న ఆయన భార్యను అక్కడే వదిలేసి ఇండియాకు వచ్చేశాడు. అప్పటి నుంచి భార్యకు టచ్ లో లేకుండా పోయాడు.

దీంతో ఆమె కెనడాలో తీవ్ర ఆందోళనకు గురవుతోంది. తన ఆవేదనను ట్విట్టర్ వేదికగా భారత విదేశాంగశాఖకు ఆమె లేఖ రాసింది. తన భర్త ఆచూకీ తెలపాలంటూ లేఖలో తెలిపింది. దీప్తి లేఖకు భారత విదేశాంగశాఖ స్పందించింది. చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి హైదరాబాద్ రాచకొండ పోలీసులకు సమాచారం ఇచ్చింది.ఈ క్రమంలో చంద్రశేఖర్ ఆచూకీ కనిపెట్టాలంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 

హైదరాబాద్ లోని చైతన్యపురిలో చంద్రశేఖర్ అన్న శ్రీనివాస్ రెడ్డి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ ఇంటి ముందు దీప్తి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతోపాటు భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ లో కూడా దీప్తి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీప్తి స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం  బ్రాహ్మణ పల్లి. అయితే..  దీప్తి తల్లిదండ్రులు బీబీనగర్ లో ఉంటారు.