వేర్వేరు ఘటనల్లో భార్యలను హత్య చేసిన భర్తలు

వేర్వేరు ఘటనల్లో భార్యలను హత్య చేసిన భర్తలు
  • కూకట్ పల్లి, రాజేంద్రనగర్​లో దారుణాలు 

శంషాబాద్/కూకట్ పల్లి, వెలుగు: అనుమానంతో భార్యలను భర్తలు హత్య చేసిన రెండు ఘటనలు నగరంలో జరిగాయి. లగ్గమైన 6 నెలలకే భార్యను చంపేసిన ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మూసాపేట గూడ్స్​షెడ్ రోడ్డులో ఉంటున్న బబ్బొది సంతోష్, పుణ్యవతి అలియాస్ ఉమ(21)లకు 6 నెలల క్రితం లగ్గమైంది. అమ్మాయి, అబ్బాయి కుటుంబాలు చాలా ఏండ్ల క్రితమే శ్రీకాకుళం నుంచి నగరానికి వచ్చి మూసాపేటలో ఉంటున్నాయి. సంతోష్ వెల్డింగ్ షాపులో వర్కర్ కాగా, పుణ్యవతి హౌస్ వైఫ్. పెండ్లయినప్పటి నుంచే భార్యపై సంతోష్ అనుమానం పెంచుకున్నాడు. రోజూ తాగొచ్చి ఆమెను వేధించేవాడు. ఈ విషయమై రెండు కుటుంబాల మధ్య కూడా గొడవలు జరిగాయి. పెద్ద మనుషులు పలుమార్లు సంతోష్ కు నచ్చజెప్పారు. అయినా అతనుతన తీరు మార్చుకోలేదు. భార్యను ఎవరితో మాట్లాడొద్దని, చివరికి ఆమె కుటుంబ సభ్యులను కూడా ఇంటికి రావొద్దని ఆంక్షలు పెట్టాడు. కాగా, గురువారం సాయంత్రం ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు సంతోష్ కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో శుక్రవారం ఉదయం తలుపులు పగలగొట్టి చూడగా పుణ్యవతి చనిపోయి ఉంది. ప్రాథమిక ఆధారాలను బట్టి సంతోష్ ఆమెను గొంతు పిసికి చంపేసి పరారయ్యాడని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

భార్య తల తీసుకొని స్టేషన్ కు... 

భార్యపై అనుమానంతో ఆమెను గొంతు కోసిచంపిన ఘటన రాజేంద్రనగర్​లో జరిగింది. ఇమద్​నగర్​లో ఉంటున్న పర్వేజ్(36), షమీమ్ బేగం(28) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెట్రోల్ బంక్​లో పని చేస్తున్న పర్వేజ్.. తాగుడుకు బానిసై, రోజూ భార్యను వేధించేవాడు. వేధింపులు తట్టుకోలేక ఆమె విడాకులు తీసుకుంది. తాను మారానని, మంచిగా ఉంటా నని చెప్పిన పర్వేజ్.. గతేడాది నుంచి ఫ్యామిలీతో ఉంటున్నాడు. అయితే మళ్లీ తాగి గొడవలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శుక్రవారం భార్యతో లొల్లి పెట్టుకున్నాడు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో గొంతు కోసి చంపేశాడు. తర్వాత ఆమెను తలను తీసుకొని స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి చనిపోయి, తండ్రి జైలుపాలు కావడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.