ఫ్లైఓవర్ ఇలా కూడా కట్టొచ్చా ! ఈ ముంబై ఇంజినీర్ల ట్యాలెంట్కు సోషల్ మీడియాలో జోకులే జోకులు..

ఫ్లైఓవర్ ఇలా కూడా కట్టొచ్చా ! ఈ ముంబై ఇంజినీర్ల ట్యాలెంట్కు సోషల్  మీడియాలో జోకులే జోకులు..

నైంటీ డిగ్రీస్ (90) ఫ్లై ఓవర్ గుర్తుందా. అదే.. ఎల్ షేప్ లో నిర్మించిన ఫ్లై ఓవర్. స్పీడ్ గా వచ్చిన వెహికిల్ డైరెక్టుగా కిందపడేటట్లు.. ఎలాంటి ఒంపు లేకుండా డైరెక్టుగా ఎల్ షేపులో మధ్యప్రదేశ్ లో నిర్మించిన ఆ ఫ్లైఓవర్ సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అంతకు మించిన క్రియేటివిటీతో ముంబైలో ఇంజినీర్లు కట్టిన ఫ్లై ఓవర్ మరోసారి అలాంటి చర్చకు దారితీసింది. ఇంజినీరింగ్ వండర్.. ఫ్లై ఓవర్ ఆఫ్ ది డికేడ్  అంటూ కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 

ఈ డిబేట్ కు కారణం ముంబైలోని మీరా–భయాండర్ ఫ్లైఓవర్. నాలుగు లేన్లుగా వెళ్తున్న ఫ్లై ఓవర్ సడెన్ గా రెండు లేన్లుగా మారటంపై తీవ్ర దుమారం మొదలైంది. మెల్రో లైన్ 9 ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఫ్లై ఓవర్ డిజైన్ పై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసింది. 

ఫ్లై ఓవర్ కు సంబంధించిన ఏరియల్ వ్యూ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. మహారాష్ట్ర ఇంజినీరింగ్ మిరాకిల్.. నాలుగు లేన్లు సడెన్ గా రెండు లేన్లుగా మారిపోవడం.. ఇదో పెద్ద మిరాకిల్ అంటూ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. 

అది మహారాష్ట్ర కావచ్చు.. మధ్య ప్రదేశ్ కావచ్చు.. ఇలాంటి అద్భుతాలు బీజేపీ ప్రభుత్వ పాలనలో కామన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రజలు యాక్సిడెంట్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే.. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ఆలోచించే పరిస్థితి లేదని విమర్శించింది. మరోవైపు జెమ్స్ ఆఫ్ మీరా భయాందర్.. అంటూ సోషల్ మీడియాలో అప్పటికే ట్రోలింగ్ మొదలెట్టారు నెటిజన్లు.

కాంగ్రెస్ పార్టీ విమర్శలు, సోషల్ మీడియాలో జరుగుతున్న డ్యామేజ్ సరిదిద్దుకునేందుకు.. ముంబై మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ (MMRDA) స్పందించింది. ప్లాన్ ప్రకారం, ఈ ఫ్లైఓవర్‌ను భయాందర్ ఈస్ట్ కోసం రెండు లేన్‌లుగా.. అదే విధంగా భయాందర్ వెస్ట్ కోసం రెండు లేన్‌లను కలిపేలా రూపొందించినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. భయాందర్ తూర్పు రూట్  అలైన్‌మెంట్‌లో ముందుగా  వస్తుంది కాబట్టి, 4-లేన్ కాన్ఫిగరేషన్ ప్రస్తుతం 2 లేన్‌లుగా మార్చినట్లు చెప్పారు. ఫ్యూచర్ లో మిగిలిన లేన్‌లను భయాందర్ వెస్ట్ వైపు విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మాత్రమే వినియోగిస్తున్నట్లు తెలిపారు.