- బయటి దొంగల పనిగా నమ్మించేందుకు డ్రామా
- గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
హుస్నాబాద్, వెలుగు: ఓ మహిళ మెడలోని బంగారాన్ని దగ్గరి బంధువులే దొంగిలించి బయటి దొంగలు చోరీ చేసినట్లుగా డ్రామా క్రియేట్ చేశారు. కొన్ని గంటల్లోనే వారి డ్రామాకు పోలీసులు తెర దించారు. హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపిన వివరాల ప్రకారం.. పోతారం(ఎస్) గ్రామానికి చెందిన బోయిని మంజుల బుధవారం తెల్లవారుజామున ఇంటి వరండాలో నిద్రిస్తోంది. ఇదే అదనుగా భావించిన ఆమె సొంత చెల్లెలు విజయభారతి, నాలుగో అక్క కూతురు(మైనర్) కలిసి మంజుల మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెల తాడు, గొలుసును వైర్ కట్టర్‌తో కట్ చేశారు.
తమపై అనుమానం రాకుండా ఉండేందుకు బాలిక తన చెవికమ్మలను కూడా తీసేసి, బయటి దొంగలు వచ్చి చోరీ చేసినట్లుగా డ్రామా సృష్టించింది. దొంగిలించిన బంగారాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇంటి ముందున్న గోళం కింద దాచిపెట్టారు. హుస్నాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో వారిపైనే అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. అనంతరం విజయభారతి, బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లోనే కేసును ఛేదించిన సీఐ కొండ్రు శ్రీను, ఎస్సై లక్ష్మారెడ్డి, సిబ్బందిని ఏసీపీ సదానందం అభినందించారు.
