
హుజూరాబాద్ ఓటమిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఇప్పటికే విచారణ కోసం ఓ ప్రత్యేక కమిటీ వేసింది అధిష్టానం. అక్కడితో ఆగకుండా.. పీసీసీ నేతల నుండి వివరణ కోరాలని డిసైడైంది. రేపు పీసీసీ నేతలతోపాటు.. పోటీచేసిన అభ్యర్ధి బల్మూరి వెంకట్ ను ఢిల్లీకి రావాలని ఆదేశించింది. దీంతో హస్తం పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది.
కాంగ్రెస్ పార్టీని హుజూరాబాద్ ఓటమి పరేషాన్ చేస్తోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్.. ఓటమికి తనదే పూర్తి బాధ్యత అని ఒప్పుకున్నా.. పోస్ట్ మార్టం ఇంకా కొనసాగుతోంది. గాంధీభవన్ లో నిర్వహించిన పీఏసీ సమావేశంలో రచ్చ, ఆ తర్వాత అధిష్టానం విచారణ కమిటీని వేసింది. అంతేకాదు నిస్పక్షపాతంగా విచారణ జరగాలని.. కర్ణాటకకు చెందిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత నంజన్యన్ మత్ ను ఏఐసీసీ నియమించింది. నెల రోజుల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఇప్పుడు పీసీసీ నేతలను అధిష్టానం ఢిల్లీకి పిలవటంపై పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. హుజురాబాద్ లో ఘోర ఓటమి.. ఢిల్లీ పెద్దలను కూడా పరేషాన్ చేసింది. దీంతో రేపు ఢిల్లీకి రావాలని పీసీసీ నేతలకు కబురు పెట్టినట్లు టాక్. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసిన బల్మూరి వెంకట్ తోపాటు.. ఎన్నిక బాధ్యతలు తీసుకున్న పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ తోపాటు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కరీంనగర్, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యే సీతక్కతోపాటు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో వున్న మరికొందరు నేతలకు ఢిల్లీ రావాలని కబురొచ్చింది.
హుజూరాబాద్ అభ్యర్ధి ఎంపిక నుండి.. ప్రచారం, ఓటమికి గల కారణాలపై విచారించనుంది హైకమాండ్. కాంగ్రెస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో సాంప్రదాయ ఓటు బ్యాంక్ వుంటుంది. అలాంటిది డిపాజిట్ గల్లంతై.. 3వేల ఓట్లు రావడం ఏంటని హస్తం పార్టీ నేతలు అయోమయానికి గురవుతున్నారు. దానిపై వివరణ తీసుకునేందుకు హైకమాండ్ పీసీసీ నేతలను ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం. అయితే అధిష్టానం వద్ద ఎలా వివరణ ఇవ్వాలో తెలియక పీసీసీ నేతలు తల పట్టుకుంటున్నారు.
హుజురాబాద్ లో బూత్ లెవల్ నుండి క్యాడర్ వున్నా.. ఓట్లు మాత్రం పడలేదు. టికెట్ ఆశించినవాళ్లు పూర్తిస్థాయిలో పనిచేయక పోవడం, జిల్లాలో కీలక నేతలుగా వున్న వాళ్లు కూడా పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘోర ఓటమికి కారణాలుగా భావిస్తోంది పీసీసీ. ఇప్పటికే కొంతవరకు ఓటమిపై అవగాహనకు వచ్చిన పీసీసీ.. ఈ ఒకటి రెండు రోజుల్లో మరింత సమాచారంతో అధిష్టానానికి రిపోర్ట్ ఇవ్వాలని భావిస్తోంది. హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేసిన బల్మూరి వెంకట్ కూడా.. తనకు ఎవరెవరు హ్యాండ్ ఇచ్చారో అధిష్టానానికి తెలపనున్నట్లు టాక్.
మొత్తానికి హుజూరాబాద్ ఓటమి కాంగ్రెస్ పార్టీని పరేషాన్ చేస్తోంది. రేపు కాంగ్రెస్ హైకమాండ్ ముందు పీసీసీ నేతలు ఎలాంటి వివరణ ఇస్తారు.. హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.