
దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన ఆనాటి సంపూర్ణ క్రాంతి ఉద్యమనేత జయప్రకాశ్ నారాయణ్ జన్మస్థలం బిహార్. నిజాయితీకి మారుపేరైన సీఎంగా కర్పూరీ ఠాకూర్ పాలించింది బిహార్ రాష్ట్రాన్నే. అవినీతికి వ్యతిరేకంగా గొంతెత్తిన లోక్‌నాయక్ జేపీ ఆదర్శాలు దేశ రాజకీయాలకే వన్నెతెచ్చాయి. అలాగే బడుగు వర్గాల నుంచి వచ్చిన కర్పూరీ ఠాకూర్ సాధారణ జీవనశైలి, సమర్థపాలన దేశంలోనే ఆదర్శ రాజకీయాలకు ఆ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపింది.
కానీ, 1990 నుంచి బిహార్ పాలన గతితప్పుతూ వచ్చింది. ఆర్జేడీ వంటి పార్టీ‘మండల్’ ( సామాజిక న్యాయం) అనే నినాదం ఆసరాగా స్థిరపడింది. సామాజిక న్యాయం పట్ల ప్రజల్లో కొంత చైతన్యం పెరిగిన మాట నిజమే. కానీ, ఆయా పార్టీలకు కులాలే పునాదులుగా మారిపోయాయి. దానివల్ల పార్టీలకు జరిగినంత ప్రయోజనం, ప్రజలకు జరగలేకపోయింది.
పార్టీలు కుటుంబాల ఆస్తులుగా మారిపోయాయి. ఫలితంగా ఉపాధి, అభివృద్ధి అనేవి ప్రజలకు దూరమవుతూ వచ్చాయి. లా అండ్ ఆర్డర్లో, అవినీతిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పెరిగి చివరకు లాలూ హయాం ‘జంగల్ రాజ్’ ఖ్యాతిని మూటగట్టుకుంది. 2005 నుంచి లాలూ శకం ముగిసి, నితీశ్ శకం మొదలైంది. నితీశ్ హయాం పాత జంగల్‌రాజ్‌ను కొంతమేరకు రీప్లేస్ చేయగలిగింది. కొంతమేర బిహార్ ఆర్థికంగా, అభివృద్ధిపరంగా మెరుగుపడిన మాట నిజమే. కానీ, బిహార్ పేదల వలసలను నితీశ్ కూడా ఆపలేకపోయాడు.
అరాచకం ఆగిపోవచ్చు, కానీ అది బీమారు రాష్ట్రం అనే మరకను తుడిచేయగలిగినా.. గరీబ్ రాష్ట్రం అనే మరకను మాత్రం తుడిచేయలేకపోయింది. ఆ విధంగా గత 35 ఏండ్ల బిహార్ రాజకీయాలు దాన్ని వలసల రాష్ట్రంగా ఉంచడం చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. నిజానికి బిహార్ రాజకీయ నేతలకు బాధలు లేవు. బిహార్ ప్రజల జీవితాల్లోనే బాధలు ఉన్నాయి. వారు దేశంలో ఎదుర్కొంటున్న అవమానాలున్నాయి.
సంప్రదాయ రాజకీయాల దుష్ఫరిణామాలు
ఆర్జేడీ కూటమి, జేడీయూ, బీజేపీ ఎన్డిఏ కూటమి బిహార్‌ను అప్రతిహతంగా 35 ఏళ్లుగా పాలిస్తూ వచ్చాయి. దశాబ్దాలుగా ఆ రెండు కూటములు సంప్రదాయ రాజకీయాలను నడుపుతూ వస్తున్నాయి తప్ప మిగతా దేశంతో పోటీపడేలా బిహార్‌ను తయారు చేయలేకపోయాయి.
పరోక్షంగా చెప్పాలంటే, అవి కులాల కూటములుగా మారాయి. అవినీతి విశృంఖలత బిహార్‌ను మరింత ‘విఫల రాష్ట్రం’గా మార్చేసింది. ఒకప్పటి లాలూ హయాంలోని ‘జంగల్‌రాజ్’ను నితీశ్ కుమార్ కొంత మార్చి ఉండవచ్చు. కానీ కుల రాజకీయాలను ఆయన మార్చలేకపోయారు. బిహార్ గరీబ్ రాష్ట్రమనే అపవాదును తుడిచేయడంలో సఫలీకృతం కాలేకపోయారు. ఇవాళ దేశవ్యాప్తంగా బిహారీలు కనిపిస్తున్నారు. దాదాపు ఒక కోటికి అటుఇటుగా బిహారీలు వలసల బాటపట్టారు. కూలి పని నుంచి మొదలుకుంటే, నైపుణ్యం కలిగిన ప్రతిపనిలో వారు కనిపిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో వారు అవమానాలు సైతం ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం గమనించొచ్చు. బిహారీలకు ముంబాయి, హైదరాబాద్ లాంటి నగరాలు దుబాయి దేశాలుగా మారాయి. అది వారి దైన్యస్థితిని తెలియజేస్తున్నది. సంప్రదాయ రాజకీయాలతో బిహార్ నిజంగా చాలా నష్టపోయింది.
జన్ సురాజ్ కొత్త రాజకీయం!
ఈ నేపథ్యాన్నే ఆసరాగా తీసుకున్న ప్రశాంత్ కిషోర్ 2022లో చంపారన్ నుంచి 3500 కి.మీ. పాద యాత్ర ద్వారా ‘బాత్ బిహార్ కీ’ కార్యక్రమాన్ని చేపట్టి 5300 గ్రామాల ప్రజలతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ ‘జన్ సురాజ్’ పార్టీని గత ఏడాది అక్టోబర్‌లో స్థాపించి. తనది ఆ రెండు కూటములకు భిన్నమైన పార్టీగా రుజువు చేసుకునే పనిలోపడ్డారు.
బిహార్ ఒక ‘విఫల రాష్ట్రం’.అది తీవ్ర ఇబ్బందుల్లోఉందనేది పీకే భావన. బిహారీలుదేశవ్యాప్తంగా అవమానాలు ఎదుర్కొంటున్నారనే ఆవేదన అక్కడి సంప్రదాయరాజకీయ పార్టీలకు పట్టకపోవడాన్ని..జన్ సురాజ్ బలంగా ఎత్తిచూపుతున్నది. జన్ సురాజ్‌కు అదొక బ్రహ్మాస్త్రంగా మారింది.ఒక కొత్త రాజకీయ వ్యవస్థ నిర్మించాలనేదే తన లక్ష్యం అంటున్నారు పీకే. బిహార్ఎన్నికల్లోమిగతా పార్టీలకు దాన్నొక సవాలుగామార్చడంలో పీకే చేస్తున్న కృషిని అభినందించాల్సిందే.
బ్రెయిన్ డ్రెయిన్
నిజానికి బిహారీలు చదువులో నేర్పరులు. వందల ఏండ్లపాటు బిహార్ ప్రపంచానికే విశ్వవిద్యాలయాలవిద్యను అందించింది. అలాంటి గొప్ప బిహార్‌లో చదువుల కోసం పలాయనం చేస్తున్నారు. ఐఐటీ, మెడికల్, సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీ, కోటా వంటి నగరాల్లో బిహారీలు చదువుతున్నారంటే, బిహార్ లో అలాంటి స్టాండర్డ్ ఇనిస్టిట్యూట్స్ లేకనే కదా!
దేశంలోని ఐఏఎస్, ఐపీఎస్‌లలో సుమారు 22శాతం బిహారీలే అని విన్నాం. బిహార్ కూలీలే కాదు, ఇంజినీర్లు, వైద్యులు, ఐటీ నిపుణులు రాష్ట్రం బయటనే చదువుతున్నారు, బయటి రాష్ట్రాల్లోనే బతుకుతున్నారు. బిహార్ ది వలసల సమస్యనే కాదు, బ్రెయిన్ డ్రైయిన్ సమస్యను కూడా ఎదుర్కొంటున్న విషయాన్ని పీకే ప్రచారంలో గట్టిగా వినిపిస్తున్నారు.
బిహార్ సంపద బయటి రాష్ట్రాలకు బదిలీ
బిహార్‌ది సహజ పేదరికం కాదని ప్రశాంత్ కిషోర్ వాదన. బిహార్ ప్రజల స్థానిక డిపాజిట్లను, బ్యాంకులు ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులుగా తరలిస్తున్నాయని.. ఫలితంగా పెట్టుబడులు లేక పారిశ్రామికీకరణ కరువైందని.. పీకే చేస్తున్న వాదనలో వాస్తవం ఉందని బిహార్ నుంచి జరుగుతున్న వలసలే చెపుతున్నాయి!
1990 నుంచి 2023 వరకు బిహార్ నుంచి రూ.26 లక్షల కోట్లు బయటి రాష్ట్రాలకు పెట్టుబడులుగా వెళ్లిపోయాయని పీకే చెపుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో 35 ఏండ్లుగా అక్కడి ప్రభుత్వాలు విఫలమవుతూ వస్తున్నాయనడానికి అదే ఒక ప్రబల సాక్ష్యం కదా!
మూడు పార్టీలపై ఒత్తిడి!
పీకే లేవనెత్తుతున్న అంశాలు ఆ మూడు (జేడీయూ,బీజేపీ, ఆర్జేడీ) పార్టీలను ప్రభావితం చేస్తాయా? పొలిటికల్ ఎనలిస్ట్‌ల అభిప్రాయం ప్రకారం జన్ సురాజ్ ఆ మూడు పార్టీల ఓట్లను చీల్చినా, ముఖ్యంగా బీజేపీ, జేడీయూ ఓట్లనే ఎక్కువగా చీల్చే అవకాశం ఉందంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా పీకే చెపుతున్నారు. 35 ఏండ్లలో బిహార్ కోల్పోయిందేమిటి? తిరిగి నూతన బిహార్‌ను ఆవిష్కరించడమెలా? అనే.. పీకే బిహార్ విజన్ ఎజెండా బుద్ధిజీవులను మాత్రం బాగా ఆలోచింపజేస్తోంది.
నూతన రాజకీయం తప్పదేమో?
దశాబ్దాల తరబడి సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిన బిహార్‌లో పీకే ప్రచారం వల్ల ఇప్పటికిప్పుడే మార్పు రాకపోవచ్చు. పీకే జన్ సురాజ్ కొంతమేర ఓట్లను సాధించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆ మధ్య నాలుగు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ 10శాతం ఓట్లు సాధించి శుభారంభం చేసింది. ఇపుడు అసెంబ్లీ ఎన్నికల్లో అది ఏ మేరకు ఓట్లను సాధిస్తుంది? కొద్దో గొప్పో సీట్లను కూడా సాధించనుందా? అనేది చూడాల్సి ఉంది.
బిహార్‌లో పీకే స్థాపించిన జన్‌సురాజ్ ఒక నూతన రాజకీయాన్ని మాత్రం ప్రారంభించింది. ఇప్పుడు కాకపోయినా 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి జన్ సురాజ్ ఎజెండా బిహార్ రాజకీయాల్లో అన్ని పార్టీలకూ అనివార్యంగా మారే అవకాశాన్ని మాత్రం కాదనలేం.
నేతగా మారిన వ్యూహకర్త
ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా అందరికీ తెలుసు. దేశంలోని అనేక పార్టీలకు ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ప్రజలను ఏవిధంగా ఆకట్టుకోవాలో, ఏయే వాగ్దానాలు చేస్తే ఆయాపార్టీలు గెలుస్తాయో అనే వ్యూహాలను తన ఐ-ప్యాక్ సంస్థ ద్వారా రచించడాన్ని వ్యాపారంగా మలుచుకున్నాడు. ఆ విధంగానే పీకే దేశ ప్రజలకు పరిచయం. అయితే, అలాంటి రాజకీయ వ్యూహాలను వ్యాపారంగా మలుచుకున్న పీకే బిహార్‌లో పార్టీ పెట్టి ఏం సాధిస్తారు అనే ప్రశ్న సహజం.
స్వతహాగా ఆయనొక రాజకీయ వ్యూహకర్త. కాబట్టి, బిహార్ లాంటి విఫల రాష్ట్రంలో దాని పునాది సమస్యలను ప్రజలకు వివరించడంలో ఎంతోకొంత సఫలమైనా అది బిహార్‌కు లాభమే. బిహార్ పునాది సమస్యలపై పీకే చేస్తున్న ప్రచారం.. పరోక్షంగా మిగతా పార్టీలపై కూడా ఒత్తిడి పెంచగలిగితే అంతకుమించి కావలసింది ఏముంటది?
బిహార్ కూలీల కర్మాగారమా?
ఇటీవల పాట్నా నుంచి ముంబయికి, అహ్మదాబాద్‌కు, ఢిల్లీకి వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తూ.. ‘బిహార్ మజ్దూర్లు, బతుకుదెరువు కోసం ముంబయికి, గుజరాత్‌కు, ఢిల్లీకి వెళ్లడానికి వందే భారత్ రైళ్లలో సులభంగా వెళ్లొచ్చు’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను పీకే తీవ్రంగా తప్పుపట్టారు. బిహార్ మజ్దూర్లను ఉత్పత్తి చేసే కర్మాగారంగా భావిస్తున్నారా? అని ప్రధానిని పీకే ప్రశ్నించడం ఆలోచింపజేస్తోంది! దాంతో గతంలో మోదీ ప్రకటించిన రూ.1 లక్షా 25 వేల కోట్ల ప్యాకేజీ ఏమైనట్లు? అనే ప్రశ్న ఎవరికైనా ఎదురవుతుంది!
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి,పొలిటికల్ ఎనలిస్ట్-