
జైలులో నిర్బంధంలో ఉన్నా రాజ్యానికి భయపడక 'ఓ నిజాము పిశాచమా! కానరాడు... నిను బోలిన రాజు మాకెన్నడేని..' అని జైలు గోడల మీద బొగ్గుతో రాసిన ధీశాలి దాశరథి కృష్ణామాచార్య. ప్రజల ఆవేదనను, ఆగ్రహాన్ని ఆయన ఆగ్నిధారలుగా మలిచారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని కృష్ణామాచార్య రాసిన కవితా పంక్తి తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఆత్మ గౌరవ నినాదంగా నిలిచింది.
రాచరికం, భూస్వామ్యం కలగలసి తెలంగాణలో సాగించిన అరాచకాలపై ధిక్కార స్వరమైన దాశరథి.. ఆ తర్వాతి కాలంలో సినీ గేయ రచయితగా, నవల, కథా రచయితగా ఎంతో పేరుతెచ్చుకున్నారు. దాశరథి కృష్ణామాచార్య ఉమ్మడి వరంగల్ జిల్లా చిన్నగూడూరులో1925 జులై 22న దాశరథి వెంకటాచార్య,- వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ చేశారు. అభ్యుదయ భావజాలం కలిగిన ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా పనిచేశారు.
ఆంధ్రమహాసభలో క్రియాశీలక పాత్ర పోషించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కమ్యూనిస్టు పార్టీని వీడి స్వామి రామానందతీర్థ నాయకత్వంలోని స్టేట్ కాంగ్రెస్లో పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయన నిజాంకు వ్యతిరేకంగా 1947లో సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయి వరంగల్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. నిజామాబాద్ జైలులో వట్టికోట ఆళ్వార్ స్వామితో కలిసి జైలు జీవితం గడిపారు. ఆకాశవాణి ప్రయోక్తగా పనిచేశారు.
తెలంగాణ స్ఫూర్తి ప్రదాత..
1953లో తెలంగాణ రచయితల సంఘానికి ఆయన తొలి అధ్యక్షుడిగా, 1977–83 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన కవిగా పనిచేశారు. కవిసింహం, అభ్యుదయ కవితా చక్రవర్తి, ఆంధ్రా కవితా సారథిలాంటి అనేక బిరుదులు పొందారు. 1987 నవంబర్ 5న ఆయన కన్నుమూశారు.
-యాకయ్య, సీనియర్ జర్నలిస్ట్-