
- చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో దారుణం
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే... తెర్రం బీజాపూర్ జిల్లాలోని తెర్రం పోలీస్ స్టేషన్ పరిధి ఛుటావాయి గ్రామానికి చెందిన కొవ్వాసి జోగ (55), బడా తెర్రం గ్రామానికి చెందిన కుర్సం మంగ్లూ (50) ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. నలుగురు మావోయిస్టులు వచ్చి గ్రామ శివారుల్లోకి తీసుకెళ్లారు.
మావోయిస్టుల సమాచారం పోలీసులకు చేరవేస్తున్నారన్న కారణంతో ఇద్దరికీ కత్తులతో పొడిచి హత్య చేసి, మృతదేహాలను అక్కడే పడేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానికులు తెర్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, కుర్సం మంగ్లూ కుమారుడైన నందు ఇటీవల మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. నందు కోసమే వచ్చిన మావోయిస్టులు.. అతడు లేకపోవడంతో అతడి తండ్రి మంగ్లును తీసుకెళ్లి చంపారు. మావోయిస్టులు 25 రోజుల్లోనే పది మందిని హత్య చేయడం బీజాపూర్ జిల్లాలో కలకలం రేపుతోంది.