కవికుల భాస్కరుడు .. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి

కవికుల భాస్కరుడు .. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహాకవి మన దాశరథి కృష్ణమాచార్య.  తన రచనలతో  ప్రజా చైతన్యాన్ని రగిలించారు. నిజాం పాలనను ఎదిరించారు. ఆ మహనీయుడి శత జయంతి ఇవాళ. ఉమ్మడి వరంగల్​ జిల్లా  చిన్నగూడూరు గ్రామంలో 1925 జులై 22న  దాశరథి కృష్ణమాచార్య జన్మించారు. ఉపాధ్యాయుడిగా  కెరీర్​ను ప్రారంభించి..  విద్యార్థులకు పాఠాలు బోధించారు.  రచయితగా,  కవిగా  సమాజాన్ని మేల్కొల్పారు.

 దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణ ఇంకా నిజాం ఏలుబడిలో నరకం అనుభవించడాన్ని చూస్తూ భరించలేక తన అక్షరాలతో  పోరు సలిపారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన రచనలు ఎందరినో ఆలోచింపజేశాయి.. కదిలించాయి.  నిజాంను ధిక్కరించినందుకు నాడు జైలు జీవితాన్ని కూడా దాశరథి  గడపాల్సి వచ్చింది.  నిజామాబాద్​ జైల్లో ఆయనను నాటి నిజాం సైన్యం బంధించింది. అయినా తన ధిక్కార స్వరం ఆపలేదు. జైలు గోడలపైనే రచనలు చేశారు. 

‘ఓ నిజాము పిశాచమా..! 

కానరాడు నిన్ను బోలినరాజు మాకెన్నడేని..! 
తీగలను తెంపి అగ్నిలో దింపినావు..! 
నా తెలంగాణ కోటి రతనాల వీణ!!’ 
అంటూ తెలంగాణ పౌరుషాన్ని తన అక్షరాలతో
చాటిచెప్పారు మన దాశరథి. 
‘రైతుదే తెలంగాణము.. రైతుదే. 
ముసలినక్కకు రాచరికంబు దక్కునే’


అంటూ నిజాంపై అస్త్రాలను సంధించారు. సినిమా పాటకు ఆయన బాటతెలుగు సినీ సాహిత్యంలోనూ దాశరథి  ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 1961లో వచ్చిన ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో ఆయన రాసిన ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ.. చలాకి మాటలు రువ్వుతూ’  గేయం అప్పట్లో  సంచలనం సృష్టించింది.

  •  ‘గోదారి గట్టుంది.. గట్టు మీన సెట్టుంది.. సెట్టు కొమ్మన  పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది? (మూగమనసులు)’,  
  • ‘ ఏ దివిలో విరిసిన పారిజాతమో.. (కన్నె వయసు)’ వంటి పాటలు ఎవర్​ గ్రీన్​గా నిలిచాయి. 

జనం కోసమే..

దాశరథి కృష్ణమాచార్య రచనల్లో జనం కోసం ఆరాటం కనిపిస్తుంది. పోరాట స్ఫూర్తి ధ్వనిస్తుంది. ఆయన రాసిన ‘అగ్నిధార’ అయినా.. ‘రుద్రవీణ’ అయినా..   ‘తిమిరంతో సమరం’ అయినా.. ‘గాలీబ్​ గీతాలు’ అయినా.. అన్నింటా జనం కోణమే. జనం కోసమే!

ఆ స్ఫూర్తి దీపం ఆరొద్దు..!

‘ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో? ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...’ అనే దాశరథి  గేయం వింటుంటే.. చదువుతుంటే.. రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఆ మహనీయుడి స్ఫూర్తి  ఆరొద్దు.  ఆయన స్ఫూర్తిని నేటితరం ముందుకు తీసుకెళ్లాలి.. అదే ఆయనకు ఇచ్చే నివాళి.  

- జీవన రాధ,రచయిత్రి, అధ్యాపకురాలు-