- వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌కు వ్యతిరేకంగా హుజూరాబాద్, సిర్సపల్లి గ్రామస్తుల ఆందోళన
- 14 రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షలు
- ప్రజలకు మద్దతుగా ఏకతాటిపైకి వచ్చిన రాజకీయ నాయకులు
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలో ఏర్పాటు చేయబోతున్న డంప్ యార్డు చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. డంప్ యార్డుకు వ్యతిరేకంగా హుజూరాబాద్‌తో పాటు సిర్సపల్లి గ్రామస్తులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతం అవుతోంది. జేఏసీగా ఏర్పడిన గ్రామస్తులు గత 14 రోజులు హుజూరాబాద్‌లో నిరాహార దీక్షలు నిర్వహిస్తుండగా.. ఈ నెల 3న హుజూరాబాద్ బంద్ చేపట్టారు.
ఈ ఆందోళనలకు మొదటి వారం రోజులు దూరంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు సైతం ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ప్రజలతో పాటు పార్టీలకతీతంగా నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. జనం ఆందోళనలు ఉధృతం అవుతుండడంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది.
25 ఎకరాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్
మున్సిపాలిటీల పరిధిలో పోగవుతున్న చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసేందుకు మున్సిపల్ శాఖ హుజూరాబాద్ శివారులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఏడాదిన్నర క్రితమే నిర్ణయించింది. ఆరు మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయబోయే ఈ ప్లాంట్ కోసం 25 ఎకరాలు కేటాయించి, నిర్మాణానికి రూ.150 కోట్లను మంజూరు చేసింది.
హుజూరాబాద్, సిర్సపల్లి గ్రామాల్లో ఆందోళన
హుజూరాబాద్ సమీపంలో డంప్ యార్డు వస్తుందన్న ప్రచారంతో ఇటు హుజూరాబాద్, అటు సిర్సపల్లి గ్రామ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే గ్రామస్తులు జేఏసీగా ఏర్పడి విద్యావంతులు, మేధావులు, వర్తక, వాణిజ్య వర్గాలతో కలిసి మార్చి 23 నుంచి నిరాహార దీక్షలు ప్రారంభించారు. తొలిరోజు సిర్సపల్లి సర్పంచ్ పోలసాని రామారావు ఆధ్వర్యంలో 300 మంది గ్రామస్తులు దీక్షలో కూర్చున్నారు.
ఈ నెల 2న హుజూరాబాద్ పట్టణంలోని స్కూల్ స్టూడెంట్లంతా అంబేద్కర్ సెంటర్‌లో మానవహారం చేపట్టారు. వీరితో పాటు రాంపూర్, రంగాపూర్, కందుగుల, సింగాపూర్ గ్రామాలకు చెందిన ప్రజలు సైతం ఆదివారం సమావేశమై వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు.
ఆందోళనలకు నేతల మద్దతు
డంప్ యార్డుకు వ్యతిరేకంగా జరుగుతున్న దీక్షల వైపు మొదటి వారం రోజులు రాజకీయ నాయకులెవరూ రాలేదు. ఆ తర్వాత ప్రజల ఆందోళన ఉధృతం కావడంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. దీంతో డంప్ యార్డ్ వ్యతిరేక ఆందోళనకు మరింత బలం చేకూరినట్లైంది. మార్చి 29న ఓయూ ప్రొఫెసర్ కాశీం సంఘీభావం ప్రకటించారు.
ఈ నెల 3న జరిగిన హుజూరాబాద్ పట్టణ బంద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. ప్లాంట్ ప్రతిపాదిత స్థలాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం సందర్శించి డంప్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
దీక్షలకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ శనివారం సంఘీభావం ప్రకటించడంతో పాటు ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని రాజ్యసభ సభ్యుడు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కోరారు.
ఇది హుజూరాబాద్ ప్రజల జీవన్మరణ సమస్య
హుజురాబాద్‌లో డంప్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం. ఇది హుజురాబాద్ ప్రజల జీవన్మరణ సమస్య. వాయు, భూగర్భ జలాల కాలుష్యంతో భవిష్యత్ తరాలకు ముప్పుగా మారే ప్రమాదముంది. డంప్ యార్డ్ ఏర్పాటయితే ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. హైదరాబాద్ జవహర్ నగర్ డంప్ యార్డుతో అక్కడి ప్రజల ఇబ్బందులు చూస్తున్నాం. ప్లాంట్ రద్దయ్యే వరకు మా పోరాటం ఆగదు.- ఈశ్వర్ రెడ్డి, డంప్ యార్డు వ్యతిరేక జేఏసీ చైర్మన్
