మాకెందుకియ్యరు పైసలు?

మాకెందుకియ్యరు పైసలు?
  • టీఆర్​ఎస్​ లీడర్లపై కమలాపూర్​ మహిళల ఆగ్రహం

కమలాపూర్/ హుజూరాబాద్ టౌన్, వెలుగు: ‘‘ఓటుకు రూ. ఆరు వేలు ఇచ్చిన టీఆర్​ఎస్​ లీడర్లు.. మాకు మాత్రం పైసా ఇయ్యలేదు. మేం ఓట్లేస్తేనే కేసీఆర్ గెలిచిండు. సర్పంచ్​, ఎంపీటీసీలను కూడా అట్లనే గెలిపించుకున్నం. కానీ మాకు ఎందుకు ఇయ్యరు పైసలు’’ అని హుజూరాబాద్​ నియోజకవర్గంలోని కమలాపూర్​ మండల కేంద్రానికి చెందిన మహిళలు ప్రశ్నించారు. బుధవారం ఉదయం నుంచే టీఆర్​ఎస్​ లీడర్లు డబ్బులు పంపిణీ చేశారని, తమకు మాత్రం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాత్రి మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. తమకు పైసలు ఇవ్వకపోవడంపై సర్పంచ్​ను ప్రశ్నించామని, ఇందుకు సర్పంచ్​.. ‘‘లిస్ట్​ లో పేరున్న వారికి మాత్రమే డబ్బులు ఇచ్చినం. మిగతా వారి సంగతి మాకు తెల్వదు. మీపై మాకు నమ్మకం లేదు. టీఆర్​ఎస్​కు ఓటేసినట్లు ఫొటో దిగి చూపిస్తే రూ. 6 వేలు ఇస్తం” అని చెప్పారని మహిళలు పేర్కొన్నారు. కష్టపడి పని చేసుకునే తమకు ఇవ్వకుండా పైసలున్నోళ్లకే ఇచ్చారని, టీఆర్​ఎస్​కు ప్రచారం చేసినా తమను గుర్తించడం లేదని మండిపడ్డారు. 
రంగాపూర్​లో రోడ్డుపై బైఠాయింపు
హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామంలోనూ ఓటర్లు రోడ్డెక్కారు. టీఆర్​ఎస్​ లీడర్లు ఒక్కో ఇంట్లో ఒక్కో రకంగా  డబ్బులు ఇచ్చారని, కొందరికి డబ్బులే పంచలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం రాత్రి హుజూరాబాద్– -జమ్మికుంట మెయిన్​ రోడ్డుపై బైఠాయించారు. ఇస్తే అందరికీ ఇవ్వాలి కానీ కొందరికే ఇచ్చి ఇంకొందరిని అవమానపరచడం ఏమిటని ప్రశ్నించారు. ట్రాఫిక్ జాం కావడంతో  పోలీసులు జోక్యం చేసుకని శాంతింపజేశారు.