గోవా తర్వాత హైదరాబాదే డ్రగ్స్​ అడ్డా

గోవా తర్వాత హైదరాబాదే డ్రగ్స్​ అడ్డా

 

  •     గంజాయి, హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌కు పెరిగిన గిరాకీ
  •     సప్లయర్లుగా మారుతున్న కస్టమర్లు
  •     యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ముందు ఎన్నో సవాళ్లు

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్‌‌‌‌ సిటీలో డ్రగ్స్‌‌‌‌ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతున్నది.  గోవా, ముంబయి, రాజస్థాన్‌‌‌‌కు చెందిన గ్యాంగ్స్ హైదరాబాద్‌‌‌‌ను డ్రగ్స్‌‌‌‌కు హబ్‌‌‌‌గా మార్చుకుంటున్నాయి. పోలీసులకు చిక్కకుండా డార్క్‌‌‌‌వెబ్‌‌‌‌, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఆర్డర్స్‌‌‌‌ చేసి కొరియర్‌‌‌‌‌‌‌‌లో డ్రగ్‌‌‌‌ పార్సిల్స్‌‌‌‌ సప్లయ్ చేస్తున్నాయి. నాంపల్లిలో కస్టమర్ల కోసం సెర్చ్‌‌‌‌ చేస్తున్న  ముంబయి గ్యాంగ్‌‌‌‌ను సెంట్రల్‌‌‌‌ జోన్ టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసులు గత శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరి నుంచి రూ.5 లక్షలు విలువ చేసే మెఫిడ్రోన్‌‌‌‌ డ్రగ్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌‌‌‌ఫోర్స్ విచారణలో నిందితులు కీలక విషయాలు వెల్లడించారు. గోవా తర్వాత హైదరాబాద్‌‌‌‌లోనే డ్రగ్స్‌‌‌‌కు ఎక్కువ కస్టమర్లు ఉన్నట్లు చెప్పారు.సిటీలో డ్రగ్స్ కస్టమర్లను గుర్తించి సప్లయ్ చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. దీంతో పోలీసులు అలర్ట్‌‌‌‌ అయ్యారు. ముంబయి పెడ్లర్స్‌‌‌‌ వివరాలు సేకరించారు.

కస్టమర్లు.. సప్లయర్లుగా మారుతూ..

డ్రగ్స్‌‌‌‌ను అరికట్టేందుకు హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ వింగ్‌‌‌‌(హెచ్‌‌‌‌న్యూ), టాస్క్‌‌‌‌ఫోర్స్,లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ పోలీసులు ఎంత నిఘా పెట్టినా సప్లయ్ జరుగుతూనే ఉంది. 3 కమిషనరేట్ల పరిధిలో ప్రతి ఏటా కస్టమర్లతో పాటు డ్రగ్స్ సప్లయర్ల సంఖ్య పెరుగుతోంది. లిక్కర్‌‌‌‌‌‌‌‌, గంజాయి కంటే యువత డ్రగ్స్‌‌‌‌ను తమ స్టేటస్‌‌‌‌ సింబల్‌‌‌‌గా మార్చుకున్నట్లు  ​ పోలీసుల దర్యాప్తులో తెలుస్తోంది. వీకెండ్స్ పార్టీలు, పబ్‌‌‌‌ ఈవెంట్లలో లిక్కర్‌‌‌‌‌‌‌‌కు బదులు డ్రగ్స్‌‌‌‌కు ప్రాధాన్యతనిస్తోంది. ఎంజాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ మోజులో డ్రగ్స్‌‌‌‌ను వ్యసనంగా మార్చుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇందులో 9వ తరగతి చదువుతున్న స్టూడెంట్ల నుంచి ఐటీ ఎంప్లాయీస్‌‌‌‌, కార్పొరేట్‌‌‌‌ దిగ్గజాల వరకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌‌‌‌ కోసం కొందరు దొంగలుగా, సప్లయర్లుగా మారుతున్నారు.

రాజస్థాన్ నుంచి నల్లమందు,  వైజాగ్ నుంచి గంజాయి

అడ్డా కూలీలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులకు రాజస్థాన్ ముఠాలు నల్లమందు సప్లయ్ చేస్తున్నాయి. దీంతో శివారు ప్రాంతాల్లోని స్లమ్‌‌‌‌ ఏరియాల్లో నల్లమందు, గంజాయి, హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ పెరిగింది. వీటికి బానిసలైన వారు క్రమంగా డ్రగ్స్ కోసం వెతుకుతున్నారు.ఈ క్రమంలోనే కస్టమర్లు సప్లయర్లుగా మారి గంజాయి, డ్రగ్స్‌‌‌‌ సప్లయ్ చేస్తున్నారు.ఈ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో గోవా, బెంగళూర్‌‌‌‌‌‌‌‌, ముంబయి నుంచి డ్రగ్స్‌‌‌‌ సప్లయ్ అవుతుండగా.. వైజాగ్‌‌‌‌ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి, హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అవుతోంది. గోవా నుంచి హెరాయిన్‌‌‌‌, కొకైన్‌‌‌‌, ఎండీంఏ లాంటి డ్రగ్స్ పెద్ద మొత్తంలో ట్రాన్స్‌‌‌‌పోర్ట్ అవుతోంది. వైజాగ్‌‌‌‌, ఒడిశా ఏజెన్సీ ఏరియాల నుంచి ప్రతి ఏటా క్వింటాళ్ల కొద్దీ గంజాయి, వందల లీటర్లలో హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ సప్లయ్ అవుతోంది.

పెడ్లర్ల చైన్‌‌‌‌ సిస్టమ్ దందా 

గుడుంబా, లిక్కర్‌‌‌‌‌‌‌‌ బానిసలు క్రమ క్రమంగా డ్రగ్స్‌‌‌‌కు బానిసలవుతున్నారు. టూరిస్ట్‌‌‌‌ స్పాట్‌‌‌‌ గోవాకు వెళ్లిన యువత పార్టీల మోజులో డ్రగ్స్‌‌‌‌ తీసుకుంటున్నారు. ఇందులో కొకైన్‌‌‌‌,హెరాయిన్‌‌‌‌కు నైజీరియన్స్‌‌‌‌ను నుంచి కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత చైన్ సిస్టమ్‌‌‌‌తో మార్కెటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, వాట్సాప్​లలో ఈవెంట్ల పేరుతో పోస్టులు పెట్టి ఆర్డర్స్‌‌‌‌ తీసుకుంటున్నారు. కమీషన్స్‌‌‌‌ ఆశ చూపి కస్టమర్లనే సప్లయర్లుగా మార్చేస్తున్నారు. ఇందులో ఎల్ఎడీ, చరస్,హెరాయిన్,కొకైన్‌‌‌‌ లాంటి డ్రగ్స్‌‌‌‌కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది.హైదరాబాద్‌‌‌‌ నార్కొటిక్స్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ వింగ్‌‌‌‌ గోవా, ముంబయిలో సెర్చెస్‌‌‌‌ చేసి గతేడాది 1,075 మందికి పైగా కన్జ్యూమర్లను ట్రేస్‌‌‌‌ చేసింది.104 కేసులు రిజిస్టర్ చేసింది.13 మంది నైజీరియన్స్‌‌‌‌ సహా మొత్తం185 మంది డ్రగ్స్‌‌‌‌ సప్లయర్లు,10 మంది ట్రాన్స్‌‌‌‌పోర్టర్లను అరెస్ట్ చేసింది.12 మంది సౌతాఫ్రికన్లను సొంత దేశానికి పంపింది.

యాంటీ నార్కొటిక్స్‌‌‌‌ బ్యూరో ప్రారంభం

హెచ్​ న్యూ పోలీసులు ఈ ఏడాది జనవరి నుంచి మే 26 వరకు 33 కేసుల్లో 72 మందిని అరెస్ట్ చేశారు. 153 గ్రాముల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. హెచ్‌‌‌‌ న్యూ సక్సెస్ కావడంతో 300కు పైగా సిబ్బందితో టీఎస్‌‌‌‌ యాంటీ నార్కొటిక్స్‌‌‌‌ బ్యూరో(టీఎస్‌‌‌‌ఏఎన్‌‌‌‌బీ)ని ఏర్పాటు చేశారు. ఈ బ్యూరోకు సిటీ సీపీ ఆనంద్​ను చీఫ్‌‌‌‌గా నియమించారు.ఈ టీమ్‌‌‌‌ రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న డ్రగ్స్, గంజాయి సహా ఇతర మత్తు పదార్ధాల కేసుల డేటాతో పెడ్లర్లు,కస్టమర్లపై నిఘా పెడుతోంది. సెంట్రల్ ఎజెన్సీస్ డీఆర్‌‌‌‌‌‌‌‌ఐ, నేషనల్ నార్కొటిక్స్‌‌‌‌ బ్యూరోతో కలిసి అంతర్రాష్ట్ర ముఠాలు,ఇంటర్నేషనల్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ మాఫియాను గుర్తిస్తోంది.  

ఆన్ లైన్ ఆర్డర్లపై నిఘా పెట్టాం

 డ్రగ్స్‌‌‌‌ సప్లయ్ ను పూర్తిగా అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గోవాలోని డ్రగ్ పెడ్లర్లకు సిటీలో సప్లయ్  అంటే భయం కలిగేలా చేశాం. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌లో కూడా హైదరాబాద్ డెలివరీ ఇస్తే సేల్‌‌‌‌ చేయడం లేదు. డార్క్‌‌‌‌వెబ్‌‌‌‌, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఆర్డర్లపై టెక్నాలజీతో నిఘా పెట్టాం. డ్రగ్స్ కోసం సెర్చ్ చేసిన వారిని గుర్తించి ట్రాక్ చేస్తున్నాం. ధైర్యం, కమిట్‌‌‌‌మెంట్‌‌‌‌, స్కిల్స్‌‌‌‌తో టీఎస్‌‌‌‌ యాంటీ నార్కొటిక్స్‌‌‌‌ బ్యూరో ఏర్పాటు చేశాం. రాష్ట్రాన్ని డ్రగ్‌‌‌‌ ఫ్రీ స్టేట్‌‌‌‌గా మారుస్తాం.

- సీవీ ఆనంద్, సీపీ, హైదరాబాద్‌‌‌‌