
హైదరాబాద్, వెలుగు: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ (జీబీసీ) లు ప్రకటించిన 'ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్' 23వ జాతీయ అవార్డులలో జీఎంఆర్ గ్రూప్‌కు చెందిన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్‌ఐఏఎల్) ‘నేషనల్ ఎనర్జీ లీడర్’, ‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్’ అవార్డులను గెల్చుకుంది. ‘ఎనర్జీ ఎఫీషియెన్సీ సమ్మిట్' 21వ ఎడిషన్ సందర్భంగా వీటిని ప్రకటించారు.
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ‘నేషనల్ ఎనర్జీ లీడర్’ అవార్డును గెలుచుకోవడం వరుసగా ఇది నాలుగవ సారి కాగా, ‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్’ యూనిట్ అవార్డును దక్కించుకోవడం వరసగా ఇది ఆరవసారి. గత మూడేళ్లుగా ఎనర్జీని సమర్ధవంతంగా వాడుకోవడానికి వివిధ చర్యలు చేపడుతున్నామని జీహెచ్‌ఐఏఎల్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు సుమారు 5.41 ఎంయూల విద్యుత్తును ఆదా చేశామని, దీని వల్ల సుమారు 4,426 టన్నుల కార్బన్ ఎమిషన్స్ తగ్గాయని వివరించింది. 2040 నాటికి నెట్ జీరో కార్బన్ సంస్థగా మారాలన్నది మా లక్ష్యమని జీహెచ్‌ఐఎఎల్ సీఈఓ ప్రదీప్ పణికర్ అన్నారు.