నాంపల్లిలోని అనీస్ -ఉల్ -ఘుర్బా నిర్మాణం పనులను సమీక్షించిన అధికారులు

నాంపల్లిలోని అనీస్ -ఉల్ -ఘుర్బా నిర్మాణం పనులను సమీక్షించిన అధికారులు

హైదరాబాద్‌లోని నాంపల్లిలో అనీస్ -ఉల్ -ఘుర్బా నూతన భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ప్రారంభించనుండగా... నిర్మాణ పనులన్నీ మరో రెండు వారాల్లో పూర్తవుతాయని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ముహమ్మద్ మసీహుల్లా ఖాన్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 5న తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ సలహాదారు అబ్దుల్ ఖయ్యూం ఖాన్‌తో పాటు , ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎంబీ షఫీవుల్లా ఐఎఫ్‌ఎస్, సయ్యద్ ఖ్వాజా మొయినుద్దీన్, ఇతర అధికారులు నిర్మాణ పనులను సమీక్షించారు. అనీస్ ఉల్ గుర్బా నిర్మాణాన్ని ఈదుల్ ఫితర్ లోపు పూర్తి చేసి త్వరలో ప్రారంభోత్సవం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సంద్భంగా ముహమ్మద్ మసీహుల్లా ఖాన్ తెలిపారు.

నగరం నడిబొడ్డున ఉన్న ఈ భవనాన్ని సమాజంలోని అనాథ, పేద, అర్హులైన చిన్నారుల విద్యాభివృద్ధికి వినియోగిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ భవనంలో హాస్టల్, పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు అబ్దుల్ ఖయ్యూం ఖాన్ తెలిపారు. ఈ భవన నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.40 లక్షలు ఖర్చు చేశామని, విద్యా కార్యకలాపాల కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనీస్-ఉల్-ఘుర్బాను ప్రమోట్ చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీకి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నేతృత్వం వహిస్తారు. ప్రస్తుతం ఈ భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.  ఈ సందర్భంగా అధికారులు జరుగుతున్న పనులను పరిశీలించి వాటి నాణ్యతపై  సమాచారం తెలుసుకున్నారు. ఏడు అంతస్తులతో కూడిన ఈ అనీస్ -ఉల్ -ఘుర్బా కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఒకేసారి పూర్తి చేస్తామని, పూర్తయిన తర్వాతే సంబంధిత శాఖలకు స్థలాల కేటాయింపు జరుగుతుందని కమిటీ గతంలోనే ప్రకటించింది.